Journalists Arrests: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాత్రి సమయంలోనే NTV జర్నలిస్టులతో పాటు ఇతర మీడియా ప్రతినిధులను అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం అని మండిపడ్డారు. జర్నలిస్టులు ఏమైనా టెర్రరిస్టులా? రాత్రి నుంచి0 వారి ఇళ్లపై దాడులు చేస్తూ, ఇంటి తలుపులు పగులగోడుతూ పండుగల సందర్భంలో కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండనివ్వకుండా, భయభ్రాంతులకు గురిచేస్తూ అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. చట్టప్రకారం నోటీసులు జారీ చేసి, పండుగల అనంతరం విచారణకు పిలవాల్సి ఉండగా, ఇలా రాత్రివేళ దాడులు చేయడం ఏ ప్రజాస్వామిక విధానమని నిలదీశారు.
అక్రమ అరెస్ట్‌లను ఖండించిన సీపీఐ..
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను CPI ఖండిస్తోందని జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. “దొంతు రమేష్, చారి, సుధీర్ ముగ్గురు ఎప్పుడూ జనాల్లో ఉండే జర్నలిస్టులు.. పారిపోయే వాళ్ళు కాదు కానీ ఈ విధంగా అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు.. దేవి యాంకర్ ఇంటికి వెళ్లి దబాయించడం ఏంటి? సిట్ వేశాక… విచారణ చెయ్యాలి కానీ ఇలా భయబ్రాంతులకు గురిచేయడం కరెక్ట్ కాదు.. భయబ్రాంతులకు గురిచేస్తూ ఈ విధంగా ఇళ్ల మీద పడి అరెస్టులు చెయ్యడం సరైంది కాదు.” అని స్పష్టం చేశారు.
మరోవైపు.. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లను వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఐదురోజుల క్రితం ప్రసారమైన వార్త మీద నిన్న సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు పూనుకుంది. సిట్ విచారణ పూర్తి చేయకుండా నిజాలను తేల్చకుండా,వెంటనే జర్నలిస్టులను అరెస్టు చేయడం,సరైనది కాదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం ఎన్‌టీవీ యాజమాన్యం క్షమాపణ కోరినఅప్పటికి, పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా అరెస్ట్ చూపకుండ, వాళ్ళను ఎక్కడ ఉంచారో చెప్పకుండా ఉండటం దారుణమని అన్నారు.
అర్ధరాత్రి సీనియర్ జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం: TVJA
NTV సీనియర్ జర్నలిస్టులైన దొంతు రమేష్, పరిపూర్ణాచారి, దాసరి సుధీర్, లను నేరస్తుల మాదిరి అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. వార్తలు రాసే విషయంలో కానీ ప్రసారం చేసే సందర్భంలో అవతల వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉంటే అలాంటి సందర్భాలలో పోలీసులు నోటీసులు ఇచ్చి సరైన పద్ధతిలో వారి వివరణ కోరితే బాగుండేది. ఇక్కడ విచారణ పేరుతో పోలీసులు జర్నలిస్టులతో ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.. అసత్య కథనాలకు ప్రసారాలకు, అక్రమ అరెస్టులకు మేము పూర్తిగా వ్యతిరేకం. ఇది ఏ ఒక్కరికి మంచి పద్ధతి కాదని ప్రకటనలో పేర్కొన్నారు.
జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌లను ఖండించిన బీఆర్ఎస్
జర్నలిస్టుల అక్రమ అరెస్టు ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. “వీళ్లేమైనా తీవ్రవాదుల నేరస్థుల అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం.. భార్యాపిల్లలు కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ రాచరిక పరిపాల సాగుతుంది. మీడియా మాధ్యమాల గొంతు నొక్కుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు సూచన.. అందరూ జర్నలిస్ట్ ఒక తాటిపైకి రండి, లేదంటే జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు.. జర్నలిస్టులను కాపాడేవారు లేకుండా పోతుంది.. జర్నలిస్టులో కలువ లేకుండా చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం.. ఒక ముగ్గురు అరెస్ట్ వల్ల కాదు ఈ ప్రమాదం జర్నలిస్ట్ అందరిడి.. అందరూ రోడ్లపై వచి నిరసన తెలపాల్సిన అవసరం ఉంది.. పోలీస్ మానువల్ ఫాలో అవ్వండి..” అని వ్యాఖ్యానించారు.
జర్నలిస్టులపై అక్రమ అరెస్టులను అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఖండించారు. బషీర్బాగ్ సీసీఎస్ వద్ద జర్నలిస్టుల అరెస్టుపై నిరసన వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో దిగ్బంధ పాలన నడుస్తోంది.. జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ఖండిస్తున్నాం.. ఇలాంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి.. జర్నలిస్టుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి.. అక్రమ అరెస్ట్ చేయడం హైయమైనా చర్య” అని తెలిపారు.
జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం: రామచందర్ రావు
ముగ్గురు ఎన్‌టీవీ (NTV) జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ప్రత్యక్ష మరియు ప్రమాదకరమైన దాడి అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న “ఇందిరమ్మ రాజ్యం” యొక్క అసలు ముఖరూపం ఈ ఘటనతో బయటపడిందని విమర్శించారు. “నాడు అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరా గాంధీ తనను విమర్శించిన వారిని ఏ విధంగా జైలుకు పంపారో, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ తన పాత ఎమర్జెన్సీ కాలపు నైజాన్ని మరోసారి చాటుకుంది,” కాంగ్రెస్ పార్టీకి ఎమర్జెన్సీ మనస్తత్వం ఇంకా పోలేదని, అధికారం దక్కగానే విమర్శించే గొంతులను భయభ్రాంతులకు గురిచేయడం, సెన్సార్‌షిప్ విధించడం, బలవంతంగా అణచివేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వార్తా ఛానళ్లపై నిషేధం విధించి విమర్శలను అణచివేయాలని చూస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి మీడియా ప్రతినిధులపై అరెస్టుల పర్వానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. “ఇది కేవలం పాత నిరంకుశ పోకడలే, కాకపోతే పార్టీ జెండా మారింది అంతే,” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ వెన్నెముక వంటిదని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. ప్రశ్నలను, విమర్శలను ఎదుర్కోలేక జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది ప్రభుత్వ భయాన్ని, అసహనాన్ని, పతనమవుతున్న పాలనా తీరును ప్రతిబింబిస్తోందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఈ అరెస్టులను నిరసిస్తోందని, మీడియా రంగానికి బీజేపీ అండగా ఉంటుందని శ్రీ రావు స్పష్టం చేశారు.ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ, భయానక వాతావరణాన్ని సృష్టించి పత్రికా స్వేచ్ఛను అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.