Telangana Congress party: రాజకీయాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాల ప్రభావం దాని పక్కనే ఉండే రాష్ట్రాల మీద పడటం సహజం. కర్ణాటకతో తెలుగు రాష్ట్రాలు రెండూ సరిహద్దులు పంచుకుంటున్నా.. కాంగ్రెస్, బీజేపీలకు ఏపీలో పెద్ద పాత్ర లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఆ రెండు పార్టీలు ప్రధాన శక్తులుగా తలపడుతున్నాయి. దీంతో మొదట్నుంచి కర్ణాటక ఫలితాలపై ఏపీ కంటే తెలంగాణలోనే ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు కర్ణాటక బంపర్ విక్టరీ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నారు టి కాంగ్రెస్ నేతలు. కర్ణాటకకు చెందిన సరిహద్దు నాలుగు జిల్లాల్లో తెలంగాణ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అక్కడి బాధ్యతలను ఇక్కడి నేతలకే అప్పగించింది హైకమాండ్. ఆయా జిల్లాల పరిధిలోని 40 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కీలక పాత్ర పోషిస్తుండటంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు తెలంగాణ నేతలు. స్వతహాగా ఇవి కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతాలు. ఇటీవలి కాలంలో బీజేపీ ప్రభావం చూపుతోందని అనుకున్నా… అదంతా తప్పని తేల్చేశాయి ఎన్నికల ఫలితాలు. కాంగ్రెస్‌కు పట్టు తగ్గలేదని, అక్కడంతా ప్రభంజనమేనని తేలిపోయింది.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పాదయాత్రలు, ఉద్యమాలు, ఆందోళనలు సభలు , సమావేశాలు ఇలా.. రకరకాల కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు ఆ పార్టీ నేతలు. ఒకవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లారు. హైకమాండ్ నుంచి ప్రియాంక గాంధీ ఇకపై స్వయంగా పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్‌లో మొన్నటి ప్రియాంక సభ తర్వాత టి కాంగ్రెస్ నేతలకు కొత్త భరోసా వచ్చింది. ఇదే సమయంలో ఇప్పుడు వచ్చిన కర్ణాటక ఫలితాలు ఆ పార్టీ నేతలకు వెయ్యి ఏనుగుల బలాన్ని తీసుకువచ్చినట్టు అయింది. కర్ణాటకలో చేసిన ప్రయోగాన్నే తెలంగాణలోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. అక్కడ ఎన్నికలకు ఆరు నెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. పొత్తుల గురించి పట్టించుకోకుండా, సర్వేల ప్రకారం, గెలుపు గుర్రాలను ఎంచుకుని నమ్మకమైన నేతలకు టిక్కెట్లు ఇచ్చింది. గతంలో రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన మాట ప్రకారం, కర్ణాటకలో దీనిని అమలు చేశారు.ఈ వ్యూహం సూపర్ సక్సెస్ అయిందనే అభిప్రాయంతో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది. గెలుస్తామన్న ధీమా మొదట్నుంచి కన్నడ కాంగ్రెస్ నేతలకు ఉన్నా… ఈ రేంజ్‌లో.. బంపర్ విక్టరీ సాధిస్తామని అనుకోలేదట. ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవడంతో… కర్ణాటక ప్రయోగాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు నేతృత్వంలో సర్వేలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.119 నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించి, త్వరలోనే అభ్యర్థుల జాబితాను సునీల్ కానుగోలు టీం, కాంగ్రెస్ హై కమాండ్ కు అందించబోతున్నారట.దాంట్లో చిన్న చిన్న మార్పు చేర్పులు చేసి , అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకముందే కర్ణాటక కాంగ్రెస్ అక్కడి ప్రజలకు హామీలు ఇవ్వడం మొదలుపెట్టింది. తాము అధికారంలోకి వస్తే గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతినెల రూ.2వేలు అందజేస్తామని ప్రకటించింది. అన్న భాగ్య యోజన పేరుతో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని తెలిపింది. నాలుగో హామీగా యువనిధి కింద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భత్యం ప్రకటించింది. డిగ్రీ పూర్తిచేసిన వారికి నెలకు 3వేలు.. డిప్లొమా వారికి 1500 రూపాయలు అందిస్తామని వెల్లడించింది. తాము అధికారంలోకి వస్తే ఈ నాలుగు ప్రధాన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కన్నడ ఓటర్లకు చెప్పింది. కర్ణాటకలో ఈ ఉచితాలు క్లిక్ అయితే.. తెలంగాణలో కూడా ఇప్పటించాలని అనుకున్నారు. తాజా ఫలితాల ప్రకారం అవి క్లిక్ అవడంతో పాటు కాంగ్రెస్ హామీలను జనం నమ్మినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్ ప్రకటించగా…. తాజాగా ప్రియాంక సభలో యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించింది టి కాంగ్రెస్. వీటికి తోడు కర్ణాటక ఫార్ములాను అమలు చేస్తే…ఎన్నికల్లో తమకు తిరుగుండదన్న ధీమా టి కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే… తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ పార్టీ నాయకులకు కర్ణాటక ఫలితం నైతిక స్థైర్యాన్నిచ్చింది. అక్కడి విజయాన్ని చూసి ఇక్కడి నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీని బతికించుకునే దిశగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు టి కాంగ్రెస్ నేతలు. వాటికి తోడు పొరుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎక్కడలేని ఉత్సాహం నింపింది ఆ పార్టీ నేతల్లో. అందుకే ఇక తెలంగాణలో దుమ్ము దులిపేస్తామని ధఈమాగా అంటున్నారు.