సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగించటం శుభపరిణామం అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రజల గొంతు నులుమే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని.. లీగల్‌గా, టెక్నికల్‌గా తప్పులు చేయటంలో చంద్రబాబు నేర్పరి అని విమర్శించారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో కూటమి నేతలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ నామస్మరణే తప్ప.. మరేమీ కనపడటం లేదని మండిపడ్డారు. ప్రజల మేలు కోసం అసెంబ్లీలో ఎలాంటి చర్చా జరగటం లేదని జోగి రమేష్ పేర్కొన్నారు.
‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజల గొంతు నులుముతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. చేతగాని, చవట, సన్నాసి ప్రభుత్వం చంద్రబాబుది. 16 నెలల తన పాలనపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడతారనుకున్నాం కానీ మోసం చేసినప్పుడు దొరక్కుండా లీగల్‌గా, టెక్నికల్‌గా ఎలా తప్పించుకోవాలో వివరించారు. తన దగ్గర ఉన్న ఈ విద్యని కూటమి సభ్యులకు వివరించారు. స్కిల్ స్కాంలో దోపిడీ చేసి అరెస్టు అయి బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబు. ఓటుకు నోటుకు కేసులో రికార్డులతో సహా దొరికిన దొంగ చంద్రబాబు. కానీ లీగల్‌గా, టెక్నికల్‌గా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అచ్చెనాయుడు ఈఎస్ఐ స్కాంలో దొరికితే ఆయన్ను అరెస్టు చేయటం తప్పా?. చింతమనేని ప్రభాకర్ జనాన్ని పీడిస్తుంటే అరెస్టు చేస్తే తప్పా?. అంగళ్లు ఘర్షణకు చంద్రబాబే కారణం. పోలీసులు పర్మిషన్ ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే దారిలో వెళ్ళి ఘర్షణకు దిగారు. ఒక కానిస్టేబుల్ కళ్లు పోవటానికి కారణమయ్యాడు. ఇవన్నీ వదిలేసి అసెంబ్లీలో ఇంకా జగన్ గారిని దూషించటమే పనిగా పెట్టుకున్నారు. రైతులకు యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్టు చేస్తారా?’ అని జోగి రమేష్ ప్రశ్నించారు.
Also Read: Extramarital Affair: భార్య వివాహేతర సంబంధం.. ఆత్మహత్యకు పాల్పడిన భర్త, కుమార్తె!
‘ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి వైఎస్ జగన్. తప్పులు చేస్తున్న చంద్రబాబును ప్రశ్నించటం తప్పా?. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. ఇదేనా భావప్రకటన స్వేఛ్చకు ఇచ్చే గౌరవం?. చేతగాని, సన్నాసి ప్రభుత్వం చంద్రబాబుది. మమ్మల్ని అణచి వేయాలనుకుంటే అది సాధ్యం కాదు. ఏం చేసినా మా నిర్ణయాన్ని నిర్భయంగా ప్రకటిస్తాం. జగన్ కుటుంబాన్ని ఎంత నీచంగా ట్రోల్స్ చేసినా దిగమింగుకున్నాం. ఆ ట్రోల్స్‌పై కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని జనం చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఆసరా, 20 లక్షల ఉద్యోగాలు, యాభై ఏళ్లకే పెన్షన్లు ఏవీ? ఎప్పుడు ఇస్తారు?. చిరంజీవిని బాలకృష్ణ అసెంబ్లీలో తిడితే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు?. పవన్ సినిమాల్లోనూ, రాజకీయంగా ఎదగటానికి చిరంజీవే కారణం. మరి అలాంటి చిరంజీవిని తిడితే పవన్, జనసేన ఎందుకు స్పందించలేదు. చిరంజీవిపై ఏమాత్రం అభిమానం ఉన్నా వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించాలి. జగన్ సినిమా వాళ్లను ఎంత గౌరవించారో ఆరోజు వచ్చిన ఆ సినీ ప్రముఖులనే అడగాలి’ అని జోగి రమేష్ ఫైర్ అయ్యారు.