రాబోయే ఎలక్షన్‌లలో చాలా పోటీ ఉంటుందని, గ్రామంలోని నాయకులు ప్రజలతో మమేకం కావాలని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. తాడిపత్రి ప్రజలకు జేసీ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, తమ కుటుంబానికి తాడిపత్రి ప్రజలే దేవుళ్లు అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా రాజకీయాల్లో కొనసాగాలంటే ప్రజల్లో ఉండాలని జేసీ చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా అని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… ‘గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో మీ అందరికీ తెలుసు. నేను ఆరోజు ధైర్యంగా ఉన్నాను అంటే మీ వల్లే. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు మూడు ఆప్షన్లు మిగిలాయి. ఒకటి కేతిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లాలి, రెండు వాడితో తలబడాలి, మూడు నేను పైకి పోవాలి. నియోజకవర్గంలో ఎవరైనా రాజకీయాల్లో కొనసాగాలంటే ప్రజల్లో ఉండాలి. తాడిపత్రి ప్రజలకు జేసీ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. రాబోయే ఎలక్షన్‌లలో చాలా పోటీ ఉంటుంది. గ్రామంలోని నాయకులు ప్రజలతో మమేకం కావాలి. మా కుటుంబానికి తాడిపత్రి ప్రజలే దేవుళ్లు’ అని చెప్పారు.
Also Read: Nimmala Rama Naidu: ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు.. రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు!
‘తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రజలు వారి సమస్యలను ఎప్పుడైనా నా దృష్టికి తీసుకురావచ్చు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడు వారికి అందుబాటులో ఉంటా. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. వారు మీసం మేలేసి నా వెంట నడిచారు. ఆ ధైర్యం వల్లే ఈరోజు మనం గెలవగలిగాం’ అని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు.