Javelin In Student Neck: ప్రభుత్వ పాఠశాలలో వార్షిక క్రీడల సందర్భంగా జావెలిన్ మెడకు గుచ్చుకోవడంతో 9వ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో శనివారం జరిగినట్లు అధికారులు తెలిపారు. సదానంద మెహర్ అనే విద్యార్థి ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అగల్‌పూర్ బాలుర పంచాయతీ హైస్కూల్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో మరో విద్యార్థి విసిరిన జావెలిన్ మెహెర్ మెడకు కుడివైపు నుంచి తగిలి ఎడమవైపు నుంచి తలలో కొంత భాగం బయటకు వచ్చింది. బాధిత బాలుడిని వెంటనే బలంగిర్‌లోని భీమా భోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థి మెడ నుంచి బయటకు తీశారు. దీంతో విద్యార్థి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
Read Also: Forbes magazine : ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ చిత్రాలివే
అయితే ప్రస్తుతం మెహర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉంది. ఈ సందర్భంలో ఇలాంటి ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడడంతో ఉపశమనం కలిగిందని బలంగీర్ కలెక్టర్ చంచల్ రాణా తెలిపారు. విద్యార్థి కుటుంబానికి తక్షణం రూ.30 వేల సాయం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, అందుకు అవసరమైన నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేయాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశించారు. ప్రమాదం గురించి చిన్నారి మేనమామ అచ్యుతానంద మెహర్ మాట్లాడుతూ.. పాఠశాల అధికారులు సమాచారం అందించడంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నామన్నారు.