Nadendla Manohar: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ప్రధానమైనదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా.. మంచి నిర్ణయాలను, కార్యక్రమాలను సమర్ధిస్తామన్నారు. కానీ ప్రజాస్వామ్య విరుద్దంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తే ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు. ప్రాధమిక హక్కులను కాపాడుకునేలా ప్రతి ఒక్కరికీ స్వేచ్చ ఉంటుందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారని కక్ష గట్టి ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేయడం మంచి విధానం కాదన్నారు. ఇటువంటి నిర్ణయాలు ఎవరు చేసినా సమర్ధించకూడదని మా అభిప్రాయమన్నారు. ఇతర జిల్లాల్లో ప్రశాంతంగా జరిగిన పాదయాత్రలు, ర్యాలీలు భీమవరంలో మాత్రమే ఎందుకు వివాదంగా మారుతున్నాయని ఆయన ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో కూడా గొడవకు దిగారన్నారు. జనసేన సభ వద్ద కూడా పోటీగా వైసీపీ వాళ్లు ప్లెక్సీలు కట్టి రెచ్చగొట్టారని ఆయన విమర్శించారు. అయినా సామరస్యంగా తాము ముందుకెళ్లి సభ నిర్వహించుకున్నామన్నారు.
Also Read: Love Marriage: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే
ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు కేసులు పెట్టే విధానాన్ని అందరూ ఖండించాలని ఆయన అన్నారు. జెండా పట్టుకున్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టడం సరి కాదన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని అడిగితే అరెస్టులు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులపై కేసులు పెట్టే ఈ విధానాలను పాలకులు విరమించుకోవాలని సూచించారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.