కొణిదెల నాగబాబు గారిని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నాగబాబు ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతోపాటు విదేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు, అభిమానులను నాగబాబు సమన్వయపరుస్తారు. ఎన్.ఆర్.ఐ.ల సేవలను పార్టీకి సమర్ధవంతంగా ఉపయోగపడే విధంగా నాగబాబు సేవలు అందిస్తారు. అదే విధంగా నెల్లూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు, గత కొన్నేళ్లుగా జనసేన పార్టీకి పరోక్షంగా సేవలందిస్తున్న వేములపాటి అజయ కుమార్ కి పార్టీకి సంబంధించి కొన్ని ముఖ్య వ్యవహారాల బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించారు.
Read Also:Corona Positive : గవర్నర్ కు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన రాజ్ భవన్ వర్గాలు
జాతీయ మీడియాకు పార్టీ తరపున అధికార ప్రతినిధిగా సేవలు అందించడంతో పాటు రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ (కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్) నిర్వహణ బాధ్యతలను అజయ కుమార్ నిర్వహించనున్నారు. డిగ్రీ వరకు నెల్లూరులో చదివిన అజయ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పి.జి. పూర్తి చేశారు. విద్యార్థి నాయకునిగా ఓయూలో చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన అజయకు వివిధ రంగాలలో మంచి ప్రవేశం వుండడంతోపాటు మానవ వనరుల అభివృద్ధిలో అపార నైపుణ్యం కలిగి వున్నారు. వీరివురు పార్టీకి మేలైన సేవలు అందిస్తారన్న గట్టి నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. నాగబాబు, అజయ కు అభినందనలు తెలియచేశారు పవన్ కళ్యాణ్. ఈమేరకు జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది.
Read Also:Chewing Gum : ఏడాదికి లక్ష టన్నుల చూయింగ్ గమ్ నమిలేస్తున్నారా ?