అక్రము సంపాదన కోసం తప్పుడు దారులు తొక్కాడు ఓ ఉన్నతాధికారి. దేశానికి సేవ చేయాల్సిన పోలీసు స్థానంలో ఉండి భరత మాతకే వెన్ను పోటు పొడిచాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారుల నుంచి డబ్బు వసూళ్లు చేయడం, బ్లాక్ మెయిల్స్ కు పాల్పడటమే కాకుండా ఆఖరికి దేశ ద్రోహులైన ఉగ్రవాదులతో కూడా చేతులు కలిపాడు. సినిమా లెవల్లో స్కెచ్ లు వేసి ఉగ్రవాదులకు సాయం చేశాడు. తన గుట్టు ఎక్కడ తెలిసిపోతుందో అని అతడి రహస్యాలు తెలుసుకోబోతున్న పోలీసులపై సైతం కేసులు పెట్టించాడు.అయినా వంద గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టకు పోయినట్లు, పాపం పండి పోలీసుల చేతికి చిక్కాడు. ఏ ఉగ్రవాదులకైతే సాయం చేశాడో వారు చెప్పడంతోనే అతని గుట్టు రట్టయ్యింది. చివరికి కటకటాల పాలయ్యాడు.
Also Read: Kurasala Kannababu: ఎంతోమంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్క పెడుతున్నాడు..!
అక్రమ సంపాదన కోసం ఉగ్రవాదులతో చేతులు కలిపిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ షేక్ ఆదిల్ ముస్తాక్ ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు కాకుండా తప్పించుకోవడం ఎలా.. అనే విషయంలో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉగ్రవాదులను తప్పిస్తున్నాడని గతంలో పట్టుబడ్డ ఓ ఉగ్రవాదిని ప్రశ్నించగా వివరాలు బయటకు వచ్చాయి. ఆదిల్ ముస్తాక్ తో తాను నిరంతరం టచ్ లో ఉన్నానని సదరు ఉగ్రవాది వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సదరు ఉగ్రవాది ఫోన్ ను పరిశీలించగా.. ఆదిల్ ముస్తాక్ తో దాదాపు 40 గంటల పాటు ఫోన్ లో మాట్లాడినట్లు తేలింది. అయితే ఇదంతా చేయడానికి ఆదిల్ చాలా సేఫ్ గా ఉంటుందని టెలిగ్రామ్ యాప్ ను ఎంచుకున్నాడు. దాని ద్వారా ఫోన్ కాల్స్, సందేశాలతో ఉగ్రవాదులకు ఆదిల్ సమాచారం అందించేవాడు.
అయితే ఇలా దిగజారుడు పనులు చేస్తూనే తన గుట్టు బయట పడకూడదని ఉగ్రవాదులకు నగదు ఎలా చేరుతోందనే అంశంపై పరిశోధన చేస్తున్న మరో ఉన్నతాధికారిని కేసులో ఇరికించేందుకు ఆదిల్ ప్రయత్నించాడు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే వారిని ప్రశ్నించగా కావాలనే నిజాయితీగా తన పని తాను చేసుకుంటున్న పోలీసు అధికారి పేరు చెప్పారు వారు. కావాలనే ఆదిల్ ఆ కేసులో అతడిని ఇరికించాడు. ఇవేకాకండా వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం ఇలా ఎన్నో ఆరోపణలు ఆదిల్ పై ఉన్నాయి. వాటన్నింటిపై కూడా పోలీసులు వరుసగా విచారణ చేస్తున్నారు. ఆధారాలతో ఆదిల్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా.. న్యాయమూర్తి ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారని వివరించారు అధికారులు. అతడి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని రాబడతామని తెలిపారు.