Kurasala Kannababu: ఎంతో మంది సీజే (చీఫ్ జస్టిస్)లను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే (రాజమండ్రి సెంట్రల్ జైలు)లో ఊచలు లెక్క పెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు.. అసెంబ్లీలో స్కిల్ స్కామ్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. డొల్ల కంపెనీలు పెట్టి అడ్డంగా దోచుకున్నారు.. ఏ మొహం పెట్టుకుని నీతి పాలన చేశామని చెప్పుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. డబ్బులను రకరకాల అకౌంట్‌లలోకి మళ్లించారు.. రూ. 371 కోట్ల స్కామ్ జరిగితే అది పెద్ద స్కామా అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబు కానుకలోనూ అవినీతి చేశారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో బెల్లం స్కామ్ కూడా జరిగింది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు.
చేసిన నేరాలకు జైల్లో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది అని సూచించారు కన్నబాబు.. ప్రత్యేక హోదా అక్కర్లేదని స్వీట్లు పంచాడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు కుదుర్చుకుంది ముమ్మాటికి చీకటి ఒప్పందమే అని విమర్శించారు.. కేబినెట్‌లో ఆమోదం చేసింది ఒకటైతే.. ఒప్పందం చేసుకుంది మరోలా అని ఆరోపించారు. కరెంట్‌పోతే చీకట్లో సంతకాలు పెట్టామనడం సిగ్గుచేటన్న ఆయన.. పక్కా ప్లాన్ ప్రకారమే స్కిల్ స్కామ్ జరిగింది.. ఫైళ్లు మొత్తం మాయం చేశారని.. అప్పటి కేబినెట్‌నే చంద్రబాబు తప్పుదారి పట్టించారు.. యువతకు శిక్షణ పేరుతో దోచుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు. విజనరీ అనే చెప్పుకుని చంద్రబాబు.. ఇప్పుడు ప్రిజనరీగా మారారు.. ఈ కేసులో ఇప్పటివరకూ 10 మందిని అరెస్ట్ చేశారు.. ఏడుగురు నిందితులు బెయిల్‌పై బయటకొచ్చారు.. బెయిల్ మీద వచ్చిన సుమన్‌బోస్‌కు చంద్రబాబు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు కన్నబాబు.