బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవితపై ఈడీ రైడ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు. తాము రెండు సంవత్సరాల క్రితమే కవిత అరెస్టు అవుతుందని చెప్పామని తెలిపారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడే కవిత అరెస్టు కావాలి.. కానీ అప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కవిత అరెస్టుతో వచ్చే సానుభూతితో మూడు నాలుగు సీట్లు సంపాదించవచ్చని బీజేపీ ఆశపడుతుంది.. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చని ఆరోపించారు. గల్లీలో కొట్లాడుకొని ఢిల్లీలో కలిసిపోతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
Read Also: CPI Narayana: ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి వ్యతిరేకించాం.. నారాయణ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది అధికారులు శుక్రవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాల సందర్భంగా కవితతోపాటు ఆమె భర్తకు సంబంధించిన వ్యాపారాలపై వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల నేపథ్యంలో కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విషయమై ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సోదాల నేపథ్యంలో కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరో మూడు, నాలుగు గంటల పాటు సోదాలు జరిగే అవకాశం ఉంది.
Read Also: Rashmika Mandanna: టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా రష్మిక మందన్న ఒనిట్సుక టైగర్!