Israel-Hamas: ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేయడంతో గాజా ప్రాంతంలో గురువారం ఒక్క రోజులోనే 80 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని పాలస్తీనా వైద్య వర్గాలు వెల్లడించాయి. ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రి ప్రకారం, ఆ నగరంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 54 మంది మరణించారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు అనేకమంది ఉన్నారు. అలాగే గాజా నగరం, ఉత్తర గాజా ప్రాంతాల్లో జరిగిన ఇతర వైమానిక దాడుల్లో మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా వైద్య వర్గాలు తెలిపాయి.
Read Also: Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం
ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం చేసిన ప్రకటన అనంతరం జరిగాయి. ఆయన “హమాస్‌ను ఓడించేందుకు ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి పూర్తి స్థాయిలో ప్రవేశిస్తుంది” అని హెచ్చరించరించడంతో ఈ దాడులు మరోమారు ఎక్కువయ్యాయి. మార్చి 18వ తేదీ నుండి రెండు నెలల పాటు కొనసాగిన కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ మళ్లీ భారీ స్థాయిలో సైనిక చర్యలు ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 2,876 మంది పాలస్తీనీయులు హతమయ్యారు. అలాగే మరో 7,800 మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు గాజాలో మొత్తం 53,010 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్టు గాజా ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
Read Also: Off The Record: బీఆర్ఎస్ సెల్ఫ్ డిఫెన్స్‌లో పడిందా..? ఎందుకలా జరుగుతోంది?
ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలోని ఏకైక క్యాన్సర్ చికిత్స కేంద్రమైన గాజా యూరోపియన్ హాస్పిటల్ పూర్తిగా సమస్యల చిక్కుల్లో చిక్కుకుందని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లే రహదారులు ధ్వంసమయ్యాయని, అంతర్గత విభాగాలకూ నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, వేలాది మంది పౌరులు రాత్రి బహిరంగంగా రాళ్లపై, వీధుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని గాజా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహ్మూద్ బసాల్ తెలిపారు.