పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతను పరిష్కరించడానికి అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే.. కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు గంటల తర్వాత.. పాకిస్థాన్ సైన్యం మళ్లీ భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఓ వార్త వైరల్ అవుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట వినడానికి పాక్ సైన్యం నిరాకరిస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం మాటను నిరాకరించిన సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించి దాడులు చేస్తోందని చెబుతున్నారు. కానీ.. భారత సైన్యం పాకిస్థాన్ దాడులను విఫలం చేసింది. కాగా.. పాక్ ప్రభుత్వం మాటను ఆ దేశ ఆర్మీ వినడం లేదా?.. కాల్పుల విరమణను పాక్ ఆర్మీ ధిక్కరిస్తుందా?.. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు, ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.
READ MORE: Cease Fire Violation : శ్రీనగర్‌లో పాకిస్థాన్ డ్రోన్ దాడులు.. వీడియో షేర్ చేసిన ఒమర్ అబ్దుల్లా..
