చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఐకూ’ ఇటీవలి రోజుల్లో భారత మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ను డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇక ‘నియో 10’ సిరీస్‌ను కూడా త్వరలో విడుదల చేయబోతోంది. చైనాలో నవంబర్ 29న ఐకూ నియో 10 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఐకూ నియో 10, ఐకూ నియో 10 ప్రోలు రిలీజ్ కానున్నాయి. చైనాలో లాంచ్ అయిన కొద్ది రోజులకే భారత్‌లో లాంచ్ కానుంది.
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో లీకైన డీటెయిల్స్ ప్రకారం.. ఐకూ నియో 10 సిరీస్ నవంబర్ 29న సాయంత్రం 4 గంటలకు లాంచ్ కానుంది. ఈ లైనప్ మూడు రంగు ఎంపికలలో (బ్లాక్, ఆరెంజ్, వైట్) రానుంది. ఈ సిరీస్ ధర దాదాపుగా 30 వేలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో వస్తుందని లాంచ్‌కు ముందు కంపెనీ ధృవీకరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో రానుంది.
Also Read: AUS vs IND: అశ్విన్ నాకు గురువు.. ఎన్నో విషయాలు నేర్పాడు: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్
ఐకూ నియో 10 స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీతో రానుంది. ఐకూ ప్రో వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో వస్తుంది. 100 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సిలికాన్ బ్యాటరీలను కంపెనీ అందించనుంది. బ్యాటరీ సామర్థ్యం 6,000 ఎమ్‌ఏహెచ్ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నియో 10 ప్రో దీర్ఘచతురస్రాకార డ్యూయల్ కెమెరా మాడ్యూల్ హౌసింగ్ స్క్వారీష్ కెమెరా సెన్సార్‌లను కలిగి ఉండనుంది. 1.5కె రిజల్యూషన్ డిస్‌ప్లే, మెటల్ మిడిల్ ఫ్రేమ్లతో ఈ ఫోన్స్ రానున్నాయి. నవంబర్ 29న పూర్తి డీటెయిల్స్ తెలియరానున్నాయి.