బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్ల సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లాలంటే.. ఈ సిరీస్ ఆస్ట్రేలియా, భారత్‌లకు అత్యంత కీలకం. కాబట్టి విజయం కోసమే ప్లేయర్స్ బరిలోకి దిగుతున్నారు. పేస్ పిచ్‌లపై స్పిన్నర్లు కూడా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ వికెట్ల వేట కోసం సిద్ధంగా ఉన్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా నాథన్ లైయన్ స్పందించాడు. ఆర్ అశ్విన్ తనకు గురువు అని, యాష్ స్పిన్ టెక్నిక్స్‌ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఫాక్స్ క్రికెట్‌తో లైయన్ మాట్లాడుతూ… ‘ఆర్ అశ్విన్ అద్భుతమైన బౌలర్. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గణాంకాలే చెబుతాయి యాష్ బౌలింగ్ గురించి. నా కెరీర్ మొత్తంలో ఎక్కువగా అశ్విన్‌తోనే తలపడ్డా. ఇంకా తలపడుతూనే ఉన్నా. యాష్ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా. పరిస్థితులకు త్వరగా ఎలా అలవాటుపడాలనేది అతడిని చూసే తెలుసుకున్నా’ అని చెప్పాడు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇదే చివరి సిరీస్.. టీమిండియా మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
‘ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో అశ్విన్ ఒకడు. తెలివైన బౌలర్ మాత్రమే కాదు.. ఏ విషయాన్ని అయినా చాలా త్వరగా నేర్చుకోగలడు. ఓ గురువుగా నాకు చాలా విషయాలు చెప్పాడు. అతడి బౌలింగ్ ఫుటేజీలను ఎప్పుడూ చూస్తూ ఉండేవాడిని. భారత్‌లో ఎలా బౌలింగ్ చేస్తాడు, ఆస్ట్రేలియాలో ఎలా బంతులు విసురుతాడు అని గమనిస్తా. మరోసారి ఆస్ట్రేలియా, భారత్ మధ్య సిరీస్ రసవత్తరంగా ఉంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లాలంటే ఈ సిరీస్ కీలకం. బాగా రాణించేందుకు ప్రయత్నిస్తా’ అని నాథన్ లైయన్ చెప్పుకొచ్చాడు. 2011/12 సిరీస్‌లో యాష్, లైయన్ పోటీ ఆరంభమైంది. ఇద్దరు స్పిన్నర్లు వారి కెరీర్‌లో ముఖ్యమైన మైలురాళ్లను సాధించారు. ఇద్దరు 500 టెస్ట్ వికెట్ల మైలురాయిని అందుకున్నారు.