భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ప్రభుత్వం అనుమతిస్తే.. ఐపీఎల్ 2025 మే 16 లేదా 17న ఆరంభమయ్యే అవకాశముంది. ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణపై పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. బీసీసీఐ రీషెడ్యూలును సిద్ధం చేసే పనిలో ఉందని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ ప్రకటలో తెలిపారు. ఐపీఎల్ 2025పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, టోర్నమెంట్‌ను త్వరగా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
మే 13 వరకు పంజాబ్ కింగ్స్ మినహా మిగతా 9 జట్ల ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్‌లలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఆదేశాల మేరకు తమ విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించడానికి 10 ఫ్రాంఛైజీలు ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. మిగిలిన 12 లీగ్ మ్యాచ్‌లను డబుల్ హెడర్‌లతో ముగించనున్నారు. అలానే రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ ఉన్నాయి. ఈ 16 మ్యాచ్‌లను హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో నిర్వహించే అవకాశముంది.
Also Read: Virat Kohli: రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకోని విరాట్ కోహ్లీ!
చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ ఇప్పటికే ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టోర్నీ నిలిచే సమయానికి పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ (16), బెంగళూరు ఛాలెంజర్స్ బెంగళూరు(16), పంజాబ్ కింగ్స్ (15), ముంబై ఇండియన్స్ (14) టాప్ 4లో ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆగిపోయే సమయానికి పంజాబ్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 రన్స్ చేసింది. అయితే ఆ మ్యాచ్‌ను అక్కడినుంచే కొనసాగించడం, లేదా మొదటి నుంచి నిర్వహించడం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మ్యాచ్‌ను రద్దు చేయి రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చే అవకాశం ఉంది.