ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నాడు. తాను టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానని, ఇంగ్లండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని తాజాగా బీసీసీఐకి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు దూరమైన నేపథ్యంలో విరాట్ కూడా తప్పుకొంటే ఇంగ్లండ్ పర్యటనలో అనుభవ లేమి భారత జట్టును దెబ్బ తీస్తుందని బీసీసీఐ భావిస్తోంది.
కనీసం ఇంగ్లండ్ సిరీస్ వరకైనా కొనసాగేలా విరాట్ కోహ్లీని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందట. ఈ విషయంపై విరాట్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదని తెలుస్తోంది. రిటైర్మెంట్ ఆలోచనను వెనక్కి తీసుకోనని చెప్పడం లేదా జట్టులో కొనసాగుతానని.. ఈ రెండింటిలో కోహ్లీ ఏదీ బీసీసీఐకి చెప్పలేదట. జున్ 20 నుంచి ఇంగ్లండ్ పర్యటన మొదలవనుంది. ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడానికి కొన్ని రోజుల ముందే కోహ్లీ తన తుది నిర్ణయాన్ని చెప్పే అవకాశముంది. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్ 2025పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే మాజీ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం విరాట్ మరి కొంతకాలం టెస్టుల్లో కొనసాగాలని కోరుకుంటున్నారు.