మలయాళీ యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుత్తూర్ తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన విఘ్నేశ్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు ఇచ్చి.. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్‌తో పాటు హిట్టర్లు శివమ్ దూబే, దీపక్ హూడాను ఔట్ చేసి ఔరా అనిపించాడు. ఈ 24 ఏళ్ల లెగ్ స్పిన్నర్ దిగ్గజం ఎంఎస్ ధోనీని కూడా ఆకట్టుకున్నాడు. అద్భుత బౌలింగ్ చేసిన విఘ్నేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
మొన్నటి వరకు విఘ్నేశ్ పుత్తూర్ అంటే ఎవరికీ తెలియదు. ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఓవర్ నైట్‌లో ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. ప్రతి ఒక్కరు ఎవరీ విఘ్నేశ్ అని గూగుల్ తల్లిని అడుగుతున్నారు. అంతేకాదు అతడిని ఫాలో చేస్తున్నారు. ప్రస్తుతం అతడికి 3.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రెండు రోజుల క్రితం 25 వేల ఫాలోవర్స్ ఉన్న అతడికి.. ఇప్పుడు ఏకంగా 3.7 మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు. ఈ సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ విఘ్నేశే.
Also Read: MS Dhoni: కొత్తలో ఆ రూల్ నచ్చలేదు.. ఇప్పటికీ నాకు అవసరం లేదు!
విఘ్నేశ్ పుత్తూర్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. రాష్ట్ర సీనియర్ జట్టుకు కూడా ఆడని ఆటగాడిని ముంబై తీసుకున్నపుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టి అందరి అనుమానాలకు చెక్ పెట్టాడు. విఘ్నేశ్ రూపంలో మరో అద్భుత ప్రతిభ ఉన్న ఆటగాడిని ముంబై పట్టుకొచ్చిందని ఆ ప్రాంచైజీపై నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. రానున్న మ్యాచుల్లో ఈ యువ స్పిన్నర్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.