Harbhajan Singh Hails Rohit Sharma Captaincy in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న టోర్నీ మొదటి మ్యాచ్ చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇక మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అయితే ఈ సీజన్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఎలా ఆడతాడు?, ఐదుసార్లు ఛాంపియన్ అయిన జట్టును కొత్త నాయకుడు హార్దిక్ పాండ్యా ఎలా నడిపిస్తాడు? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముంబై నిర్ణయంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
రోహిత్ శర్మ ఛాంపియన్ ప్లేయర్ అని, గొప్ప లీడర్ అని హర్భజన్ సింగ్ ప్రశంసించాడు. ఒక్కసారిగా కెప్టెన్సీ నుంచి తొలగించడం రోహిత్‌ను దిగ్భ్రాంతికి గురి చేసి ఉంటుందన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌లో ఐపీఎల్ డైలీ షోలో హర్భజన్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ ఛాంపియన్ ప్లేయర్, గొప్ప లీడర్. ముంబైని అతడు ఐదు సార్లు విజేతగా నిలిపాడు. భారత జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. ఒక్కసారిగా కెప్టెన్సీ నుంచి తొలగించడం అతడిని దిగ్భ్రాంతికి గురి చేసి ఉంటుంది. భవిష్యత్తు కోసం ముంబై ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు’ అని అన్నాడు.
Also Read: Adah Sharma-Bastar: ‘ది కేరళ స్టోరీ’ మాదిరే.. వివాదంలో అదా శర్మ కొత్త మూవీ!
‘ముంబై జట్టు విజయాల్లో తప్పకుండా రోహిత్ శర్మ భాగస్వామ్యం అవుతాడని ఆశిస్తున్నా. రోహిత్ ఓ సాధారణ ప్లేయర్‌గా ముంబై జట్టులోకి అడుగు పెట్టి.. గొప్ప నాయకుడిగా ఎదిగాడు. తన కెప్టెన్సీ సామర్థ్యం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే సడెన్‌గా ముంబై ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు కానీ భవిష్యత్తులో మెరుగైన పనితీరు కోసం మార్పు చేసి ఉండొచ్చు. గుజరాత్ టైటాన్స్‌ను తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతడు జట్టుకు అదనపు బలం చేకూరుస్తాడు. నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవడంలో హార్దిక్ ముందున్నాడు’ అని హర్భజన్ పేర్కొన్నాడు.