INS Vikrant: భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ సందర్శించారు. ఆంథోనీ అల్బనీస్ ఈరోజు క్యారియర్‌లో గార్డ్ ఆఫ్ హానర్‌ను అందుకున్నారు. తర్వాత నౌకపై ఉన్న యుద్ధ విమానంలో కాసేపు కూర్చున్నారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన తొలి విదేశీ ప్రధాని అల్బనీస్ కావడం విశేషం. “ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారతదేశం స్వయంగా రూపొందించిన INS విక్రాంత్‌ను సందర్శించేందుకు ఇక్కడకు రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ను ప్రధాన కేంద్రంగా ఉంచాలనే ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానానికి నా పర్యటన నిదర్శనం. ముందుచూపుతో రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు’’ అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అన్నారు.
భారతదేశం, ఆస్ట్రేలియా సన్నిహిత వ్యూహాత్మక భాగస్వాములు అని ఆంథోనీ అల్బనీస్ అన్నారు . ఈ ఏడాది ఆగస్టులో ఆస్ట్రేలియా భారత్, జపాన్, అమెరికాతో కలిసి మలబార్ నౌకాదళ విన్యాసాలకు ఆస్ట్రేలియా నాయకత్వం వహిస్తుందని ఆయన ప్రకటించారు. ఈరోజు ఉదయం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టును ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ఆస్ట్రేలియా ప్రధాని అరగంట పాటు వీక్షించారు.
Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ
ఐఎన్‌ఎస్ విక్రాంత్ గత ఏడాది సెప్టెంబర్‌లో నౌకాదళంలోకి ప్రవేశించింది. 45,000 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌకను రూ. 20,000 కోట్లతో నిర్మించారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక. ఇందులో మిగ్-29కె ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్‌లతో సహా 30 విమానాలు ఉండవచ్చు. ఈ యుద్ధనౌక దాదాపు 1,600 మంది సిబ్బందికి వసతి కల్పిస్తుంది.