జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పాకిస్థాన్ చేసిన బహుళ క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ను భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఇస్లామాబాద్‌తో పాటు లాహోర్, సియాల్‌కోట్, కరాచీలో దాడులు నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా ఈ అంశంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఈరోజు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలకు (SOP) అనుగుణంగా నాన్-కైనటిక్ సామర్థ్యాలను ఉపయోగించి దాడులను తిప్పికొట్టాం. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది.” అని ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా.. గురువారం రాత్రి సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా గగనతలంలో ఎనిమిది పాకిస్థాన్ క్షిపణులను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా ధ్వంసం చేసింది. భారతదేశం వెంటవెంటనే చేస్తున్న ప్రతీకార చర్యలతో పాకిస్థాన్ పూర్తిగా భయాందోళనలకు గురైంది. భారత సైన్యం దాడిని పాకిస్థాన్ సైన్యం తట్టుకోలేకపోతోంది. ఇప్పటికే శత్రుదేశంలోని ఏడు ప్రధాన నగరాలపై భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో పెషావర్, ఇస్లామాబాద్, కరాచీ, సియాల్‌కోట్, రావల్పిండి వంటి నగరాలు ఉన్నాయి. ఈ దాడిలో పాకిస్తాన్ డ్రోన్ నిరోధక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.
READ MORE: India-Pakistan War: యుద్ధ బరిలోకి INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం?