Women’s Kabaddi World Cup 2025: మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టును భారత్ మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత్ – చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో ఓడించింది. వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచకప్ విజేతగా నిలిచి భారత మహిళల జట్టు నయా చరిత్రను లిఖించింది.
మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఢాకా వేదికగా జరిగిన సెమీఫైనల్లో భారత్ మహిళల జట్టు 33–21 పాయింట్ల తేడాతో ఇరాన్ జట్టును మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మరో సెమీఫైనల్లో చైనీస్ తైపీ 25–18 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. మొత్తం 11 జట్లు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్, చైనీస్ తైపీ అజేయంగా ఫైనల్‌కు చేరాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ… గ్రూప్ ‘బి’లో చైనీస్ తైపీ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి. చివరి మజిలీలో చైనీస్ తైపీ జట్టును భారత్ మట్టి కరిపించి మహిళల కబడ్డీ ప్రపంచ కప్‌లో విశ్వవిజేతగా అవతరించింది. రీతూ నేకి నాయకత్వంలో భారత మహిళా కబడ్డీ టీమ్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ జట్టులో ఐదుగురు హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన వారే కావడం విశేషం.
కబడ్డీ ప్రపంచకప్ విజయం సాధించిన మహిళల టీమిండియా జట్టును రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, దేశానికి వర్డల్ కప్ తీసుకొని వచ్చిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కాలంలో క్రీడారంగంలో మహిళలు చూపిస్తున్న ప్రతిభ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
READ ALSO: Hombale Films – RCB: ఆర్సీబీ ఓనర్‌షిప్ కోసం హోంబలే ఫిల్మ్స్ ప్లాన్.. పోటీలో ప్రముఖ కంపెనీలు!