ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అనిశ్చితి వీడిన విషయం తెలిసిందే. బీసీసీఐ కోరిక మేరకు హైబ్రిడ్ మోడల్‌లోనే టోర్నీ జరిపేందుకు పీసీబీ అంగీకరించింది. అయితే పీసీబీ కోరినట్లుగా 2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో ఇండో, పాక్ మ్యాచ్‌లు.. భారత్ లేదా పాకిస్థాన్‌లో ఎక్కడ జరిగినా తటస్థ వేదికలోనే నిర్వహిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించబోమని ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పడంతో.. పీసీబీ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు సిద్దమైంది.
Also Read: IND vs WI: మెరిసిన స్మృతి, రేణుక.. 211 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం!
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికగా దుబాయ్‌ని ఎంపిక చేశారు. సెమీ ఫైనల్స్, ఫైనల్ కూడా దుబాయ్‌లోనే జరుగుతాయి. ఈ విషయాన్ని పీసీబీ ప్రతినిధి అమిర్ మీర్ ఆదివారం ఓ ప్రకటనలో చెప్పారు. ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే.. తుది పోరు లాహోర్‌లో జరగనుందని తెలుస్తోంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తుది షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలో ప్రకటించనుంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా.. ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇండో, పాక్ జట్లు తలపడుతున్నాయి.