India Slams Pakistan: రష్యాపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ బుధవారం తగిన సమాధానం ఇచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఐరాస జనరల్ అసెంబ్లీ(UNGA)లో జరిగిన ఓటింగ్‌పై తన వివరణలో పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ రెండు పరిస్థితుల మధ్య సమాంతరాలను రూపొందించే ప్రయత్నంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ ఫోరమ్‌ను దుర్వినియోగం చేయడానికి భారత్‌పై అర్థంలేని వ్యాఖ్యలు చేయడానికి ఒక ప్రతినిధి బృందం చేసిన ప్రయత్నం ఆశ్చర్యకరంగా ఉందని ఆమె అన్నారు. పదేపదే అబద్ధాలు చెప్పే మనస్తత్వం నుంచి ఇటువంటి ప్రకటన సామూహిక ధిక్కారానికి అర్హమైనది అని భారత దౌత్యవేత్త అన్నారు.జమ్మూ కాశ్మీర్ మొత్తం భూభాగం ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని రుచిరా కాంబోజ్ తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపాలని తాము పాకిస్తాన్‌ను కోరుతున్నామన్నారు. తద్వారా పౌరులు జీవించే హక్కును స్వేచ్ఛగా ఆస్వాదించవచ్చని ఆమె పేర్కొన్నారు.
అంతకుముందు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నాలుగు ఉక్రేనియన్ ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 143 మంది, వ్యతిరేకంగా ఐదుగురు సభ్యులు ఓటు వేశారు. భారత్ సహా మొత్తం 35 దేశాలు తీర్మానానికి దూరంగా ఉన్నాయి. రష్యాను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి దూరంగా ఉన్న తర్వాత, ఉక్రెయిన్‌లో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలతో సహా సంఘర్షణ తీవ్రతరం కావడంపై భారతదేశం బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
PM Narendra Modi: నాలుగో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
భద్రతా మండలిలో రష్యా ఇదే విధమైన ప్రతిపాదనను వీటో చేసిన తర్వాత వచ్చిన తాజా తీర్మానంలో పలు దేశాలు అక్రమ విలీన ప్రయత్నాలను ఖండించినట్లు తెలుస్తోంది.సభ్య దేశాల ముందు ఓటు గురించి తన వివరణను అందజేస్తూ భారత రాయబారి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. మానవ వ్యయంతో ఎటువంటి పరిష్కారాన్ని చేరుకోలేమని, శత్రుత్వాలు పెరగడం ఎవరికీ ప్రయోజనం కాదని భారతదేశం స్థిరంగా వాదిస్తున్నదని అన్నారు. దౌత్య పద్ధతిలో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ఆమె భారత్ తరఫున వివరించారు.