2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక 7 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ విజయంతో లంక సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. నాలుగు జట్లు భారత్, న్యూజిలాండ్, శ్రీలంక సహా పాకిస్తాన్ టీమ్స్ ఇప్పుడు నాలుగో స్థానం కోసం రేసులో ఉన్నాయి. లీగ్ దశలో కేవలం ఏడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా.. త్వరలోనే నాలుగో స్థానంపై క్లారిటీ రానుంది.
భారత్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. టీమిండియా నెట్ రన్ రేట్ 0.526గా ఉంది. హర్మన్‌ప్రీత్ సేన వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే సెమీఫైనల్లో సులభంగా స్థానం సంపాదించగలదు. గురువారం న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్ హర్మన్‌ప్రీత్ సేనకు చావోరేవో లాంటిదని చెప్పొచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోతే.. ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓడాల్సి ఉంటుంది. అప్పుడు చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా ఓడించాలి.
ఒకవేళ భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. బంగ్లాదేశ్‌ను టీమిండియా ఓడించాలి. అప్పుడు శ్రీలంక లేదా పాకిస్తాన్ ఆరు పాయింట్లు సాధించకపోతే.. టీమిండియాకు నాలుగో స్థానం దక్కుతుంది. భారత్ ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దయితే.. భారత జట్టు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఇంగ్లాండ్ టీమ్ న్యూజిలాండ్‌ను ఓడించాలి.
Also Read: Vangalapudi Anitha: పవన్ కళ్యాణ్ తప్పులేదు.. తగిన చర్యలు తీసుకుంటాం!
న్యూజిలాండ్ కూడా ఐదు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లను కలిగి ఉంది. అయితే రన్ రేట్ -0.245గా ఉండడంతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. కివీస్ తన తదుపరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే.. ఎనిమిది పాయింట్లతో సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగే మ్యాచ్ డూ-ఆర్-డైగా మారింది. భారత్‌ను ఓడించి ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓడిపోతే.. టీమిండియాను బంగ్లా ఓడించాల్సి ఉంటుంది. భారత్‌తో జరిగే మ్యాచ్ వాష్ అవుట్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్‌ను న్యూజిలాండ్ ఓడించాలి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా ఓడిపోవాలి. పాకిస్తాన్, శ్రీలంకకు కూడా అవకాశాలు ఉన్నా.. అది కాస్త కష్టమనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.