Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రపంచ వ్యాప్తమయింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా జాబిల్లిపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ జీవితకాలం కేవలం 14 రోజులే కావడం గమనార్హం. చంద్రుడిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్, దాని నుంచి బయటకు వచ్చిన చంద్రునిపై సంచరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ఏం చేసినా ఈ 14 రోజుల్లోనే పూర్తి చేయాలి. ఆ తర్వాత పనిచేయవా.. ఎందుకలా అనే ప్రశ్నలకు ఇస్రో సమాధానాలు ఇచ్చింది.
చంద్రుడిపై దిగిన ల్యాండర్, దాని నుంచి వెలువడిన రోవర్ 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేయనున్నాయి. ఈ మిషన్ లోని ల్యాండర్ గాని, రోవర్ గాని పనిచేయడానికి, అలాగే అవి సేకరించిన సమాచారాన్ని భూమికి పంపడానికి విద్యుత్ అవసరం. వాటికి కావాల్సిన విద్యుత్ సూర్యకాంతి ద్వారా వస్తుంది. అందుకే చంద్రునిపై సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండర్‌ను ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ క్రమంలో ఈ మిషన్ లో ప్రధాన భాగాలైన లాండర్, రోవర్‌కు అమర్చిన సోలార్ ప్యానల్ సౌర శక్తిని స్వీకరించి విద్యుత్ శక్తిగా మార్చుకుంటాయి. ఆ శక్తి ద్వారా ల్యాండర్, రోవర్ పనిచేస్తాయి.
Read Also: ISRO EX Chairman: ఇస్రో శాస్త్రవేత్తల జీతంపై మాజీ ఛైర్మన్ ఏమన్నారంటే..!
ఈ 14 రోజులు సమయం ఏంటంటే.. భూమిపై 14 రోజుల కాలం చంద్రుడిపై ఒక్క పగలు మాత్రమే. వాస్తవానికి చంద్రుని మీద ఒక్కరోజు 28 భూమి రోజులకు సమానం. ఈ క్రమంలో 14 రోజుల పగటి సమయంలో మాత్రమే ఈ ల్యాండర్, రోవర్లు పనిచేస్తాయి. తర్వాతి 14 రోజుల సమయంలో పూర్తి చీకటితో అత్యధిక శీతల ఉష్ణోగ్రతలు నమోదయితయి. చంద్రుని మధ్య భాగంలో దాదాపు 110 డిగ్రీల నుండి 140 ఉష్ణోగ్రత నమోదవుతుంది. అలాగే రాత్రి సమయంలో మైనస్ 200 డిగ్రీల వరకు నమోదు కాగా. ధ్రువపు ప్రాంతాలలో ఆ ఉష్ణోగ్రతలు మరింత తక్కువకు పడిపోతాయి. అంటే చంద్రుడి లెక్క ప్రకారం మన చంద్రయాన్ ల్యాండర్, రోవర్ అక్కడ ఒక్క రోజు మాత్రమే ఉంటాయి. అంటే 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యుడు అస్తమిస్తాడు. ఆ తర్వాత చంద్రుడి ఉపరితలం అంతా చీకటిగా మారిపోతుంది. దీంతో అక్కడ చిమ్మ చీకటి అయిపోతుంది. దీంతో పాటు ఉష్ణోగ్రత కూడా ఏకంగా మైనస్ 180 డిగ్రీలకు చేరుకుంటుంది. రోవర్, ల్యాండర్, పేలోడ్‌లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
Read Also: 69th National Film Awards: జాతీయ సినిమా అవార్డులు.. అల్లు అర్జున్ సహా ఎవ్వరినీ వదలని పవన్..
మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ల్యాండర్, రోవర్ పూర్తి మంచుతో కప్పబడుతాయి. అంతటి కఠిన వాతావరణంలో ఉండే రోవర్లలోని బ్యాటరీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి. ల్యాండర్‌లోని సోలార్ ప్యానల్ కూడా దాదాపు చెడిపోతాయి. ఒకవేళ 14 రోజుల తర్వాత .. రోవర్‌పై సూర్య రశ్మి పడి తిరిగి పని చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఒకవేళ రోవర్ తిరిగి పునరుజ్జీవం పొంది.. ల్యాండర్ పనిచేయక పోతే ఫలితం ఉండదన్నారు. రోవర్ స్వీకరించిన సమాచారం ల్యాండర్‌కు చేరవేస్తుందని.. ఆ ల్యాండర్ భూమిపై ఉన్న రీసెర్చ్ సెంటర్‌కు పంపిస్తుందని చెప్పుకొచ్చారు. ఒకవేళ 14 రోజుల తర్వాత తిరిగి ల్యాండర్ పనిచేస్తే.. అది స్వీకరించిన సమాచారాన్ని భూమికి పంపించగలదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవి 14 రోజులలోనే.. అవి చేయగలరని పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.