UN Secretary-General: భారత్ విశ్వ దేశమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు. బహుపాక్షిక వ్యవస్థలో భారత్ ముఖ్యమైన భాగస్వామి ఆయన వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వంపైనా ఆయన స్పందించారు. ఈ విషయంలో నిర్ణయం తమ చేతుల్లో ఏమీలేదని.. సభ్యదేశాలే తుది నిర్ణయం తీసుకుంటాయన్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న గుటెరస్.. భారత్ యూఎన్‌ఎస్‌సీలో చేరేందుకు సమయం ఆసన్నమైందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.
Also Read: G20 Summit 2023 LIVE UPDATES: జీ20 సదస్సు.. భారత్‌కు చేరుకున్న చైనా ప్రధాని లీ కియాంగ్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భాగం కావడానికి భారతదేశం బలమైన పోటీదారుగా భావిస్తున్నారా అనే ప్రశ్నకు గుటెర్రెస్ స్పందిస్తూ, “భద్రతా మండలిలో ఎవరు ఉండాలనేది నేను నిర్ణయించాల్సిన అవసరం లేదు. అది సభ్య దేశాలే నిర్ణయిస్తాయి. భారతదేశం నేడు అత్యధిక జనాభా కలిగిన దేశమే కాకుండా.. విశ్వదేశమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ బహుపాక్షిక వ్యవస్థలో భారతదేశం చాలా ముఖ్యమైన భాగస్వామి అని స్పష్టంగా ఉంది. నేటి ప్రపంచంలో వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి సంస్కరణ మనకు అవసరమని నేను నమ్ముతున్నాను.” అని గుటెరస్ అన్నారు. ప్రపంచానికి 21వ శతాబ్దపు వాస్తవికతలతో, UN చార్టర్, అంతర్జాతీయ చట్టంపై ఆధారపడిన ప్రభావవంతమైన అంతర్జాతీయ సంస్థలు అవసరమని యూఎన్ చీఫ్ నొక్కి చెప్పారు. అయితే, ఈ సంస్కరణలకు ఏమైనా కాలక్రమం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. వాటిని చేయాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు.
ప్రపంచం క్లిష్ట సమయంలో ఉందని పేర్కొన్న గుటెరస్.. వాతావరణం, సుస్థిర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని జీ20 నాయకులకు పిలుపునిచ్చారు. జీ20కి హాజరవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. జీ20కి ఆహ్వానం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపిన గుటెరస్.. భారత్ సారథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించడం ప్రపంచ మార్పుకు సంకేతమని అన్నారు. గ్లోబల్ సౌత్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కావాల్సినంత చేస్తోందని ఐరాస చీఫ్ చెప్పారు. ఉపనిషత్తుల నుంచి వచ్చిన వసుధైక కుటుంబం అనే పదం నేటి ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’పై దృష్టి పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. ఉపనిషత్తుల నుంచి ప్రేరణ పొందిన పదం నేటి ప్రపంచ సమస్యలకు సరైన పరిష్కారాలను సూచిస్తుంది. ప్రపంచంలో విభేదాలు, ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలో ఈ స్ఫూర్తి అవసరం’ అని గుటెరస్ అన్నారు.
Also Read: Rishi Sunak: యూకేలో ఖలిస్తానీ తీవ్రవాదాన్ని సహించను.. హిందువుగా గర్విస్తున్నా..
ప్రపంచానికి కోల్పోయే సమయం లేదని, కంటికి కనిపించేంత వరకు సవాళ్లు విస్తరించి ఉన్నాయని యూఎన్ సెక్రటరీ జనరల్ అన్నారు. వాతావరణ సంక్షోభం నాటకీయంగా క్షీణిస్తోందని ఆయన తెలిపారు. అయితే సమిష్టి ప్రతిస్పందనలో ఆశయం, విశ్వసనీయత, ఆవశ్యకత లోపించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు, వివాదాలు పెరిగిపోతున్నాయని, అయితే శాంతిని పెంపొందించే ప్రయత్నాలు విఫలమవుతున్నాయన్నారు. కొత్త సాంకేతికతలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. పేదరికం, ఆకలి, అసమానతలు పెరుగుతున్నాయని ఆయన ఎత్తి చూపారు. మొదటిది వాతావరణం, రెండు ప్రాధాన్యతా రంగాలలో నాయకత్వాన్ని ప్రదర్శించాలని జీ20 నాయకులను ఆయన కోరారు.