India China Tensions: హిందూ మహాసముద్రంలో చైనా గూఢచర్యం బయటపడిన తర్వాత భారతదేశం తన క్షిపణి పరీక్ష షెడ్యూల్‌ను మార్చుకుంది. అండమాన్ – నికోబార్ దీవుల సమీపంలో డిసెంబర్ 1 నుంచి 3 మధ్య జరగాల్సిన క్షిపణి పరీక్షల కోసం తాజాగా ఇండియా కొత్త NOTAM (నో-ఫ్లై జోన్) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో 490 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాంతాన్ని పరీక్షల కోసం ఎంచుకుంది.
భారతదేశం కొత్త ప్రకటనకు ముందు హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు ఒక్కసారిగా పెరిగాయి. షి యాన్-6, షెన్ హై యి హావో, లాన్ హై 201 అనే మూడు చైనా నిఘా, పరిశోధన నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒకేసారి కనిపించాయి. నిఘా వర్గాల ప్రకారం.. చైనా నౌకలు భారతదేశం యుద్ధ సాంకేతికతను నిశితంగా పరిశీలించడానికి గూఢచర్యం చేస్తున్నాయని సమాచారం. చైనా చర్య గురించి తెలుసుకున్న భారత్, డ్రాగన్ నౌకల దృష్టిని మళ్లీంచడానికి క్షిపణి పరీక్ష షెడ్యూల్‌ను మార్చుకుంది.
చైనా గూఢచారి నౌకల ఉనికి..
చైనా గూఢచారి నౌకల ఉనికి ఎలా గుర్తించారు అంటే.. చైనా పరిశోధన నౌక షి యాన్-6. కానీ భారత భద్రతా సంస్థలు దీనిని హైటెక్ గూఢచారి నౌక అని విశ్వసిస్తాయి. షి యాన్-6 అండమాన్ దీవులకు దక్షిణంగా అంతర్జాతీయ జలాల్లో ఉంది. దీని వల్ల భారతదేశం మొదట జారీ చేసిన క్షిపణి పరీక్ష షెడ్యూల్ (నవంబర్ 25-27) వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఈ పరీక్ష ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి 3 మధ్య జరుగుతుంది. ఈ సమయంలో చైనా నౌక ఆ ప్రాంతం నుంచి బయలుదేరి మారిషస్ వైపు వెళుతుందని అంచనా వేస్తున్నారు.
హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతోందని సమాచారం. ప్రస్తుతం మూడు చైనా నౌకలు వేర్వేరు ప్రదేశాలలో హిందూ మహాసముద్రంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. అందులో 1. షి యాన్-6 నిఘా నౌక. ఇది భారతీయ క్షిపణి శ్రేణులను పర్యవేక్షించగలదు . అలాగే నీటి అడుగున కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ఈ నౌకలో అధునాతన సెన్సార్లు అమర్చారు.
2. షెన్ హై యి హావో : ఇది చైనా డీప్-సీ సర్వే షిప్. మాల్దీవుల చుట్టూ చురుగ్గా ఉంటుంది . 7,000 మీటర్ల వరకు చొచ్చుకుపోయే డీప్-సీ సబ్‌మెర్సిబుల్ టెక్నాలజీ ఈ నౌక సొంతం. సముద్రగర్భం, ఖనిజాలు, సముద్రగర్భ కేబుల్ మార్గాలను మ్యాప్ చేస్తుంది. ఈ డేటా సైనిక దృక్కోణం నుంచి చాలా సున్నితంగా ఉంటుంది.
3. లాన్ హై 201: సోనార్ నిఘా నౌక. ఇది లక్షద్వీప్ పశ్చిమాన పనిచేస్తుంది. నీటి అడుగున నిర్మాణం, కదలికల సోనార్ డేటాను ఈ నౌక సేకరిస్తుంది. జలాంతర్గామి కదలికలు, నావికా కార్యకలాపాలను పర్యవేక్షించగల సామర్థ్యం దీని సొంతం.
అయితే క్షిపణి పరీక్షను రద్దు చేయడం లేదని, కేవలం వాయిదా వేశామని భారతదేశం స్పష్టం చేస్తూ కొత్త నోటామ్ జారీ చేసింది. తదుపరి పరీక్షా సమయం డిసెంబర్ 1 నుంచి 3కి నిర్ణయించారు. ఇప్పుడు అందరి దృష్టి చైనా షి యాన్-6 గూఢచర్యం నుంచి ఈ క్షిపణి పరీక్ష తప్పించుకుంటుందా.. లేదంటే భారతదేశం మరోసారి తన పరీక్ష వ్యూహాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుందా అనే దానిపై ఉంది. ఇప్పుడు భారతదేశం-చైనా పోటీ భూమిపైనే కాకుండా సముద్రంలో కూడా వేడెక్కుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Mallika Sagar: WPL వేలంలో స్పెషల్ అట్రాక్షన్‌గా మల్లికా సాగర్.. ఇంతకీ ఎవరు ఈమే!