Dulhasti Stage 2 Project: పాకిస్థాన్‌కి గడ్డు కాలం మొదలు కానుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక కమిటీ జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చెనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్–2 జలవిద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌తో ఉన్న ఇండస్ జల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ) ప్రస్తుతం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇండస్ నది, దాని ఉపనదుల నీటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్‌లో జరిగిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి తర్వాత, 1960లో కుదిరిన ఇండస్ జల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌కు కేటాయించిన ఇండస్ నది పశ్చిమ ఉపనదులైన చెనాబ్, జెలమ్, ఇండస్‌లపై భారత్ తన హక్కులను వినియోగించుకునేందుకు వేగంగా చర్యలు ప్రారంభించింది. దీని లక్ష్యం జలవిద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం, నీటి భద్రతను ప్రాధాన్యంగా తీసుకోవడం షురూ చేసింది. దుల్హస్తీ స్టేజ్–2 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడం, జులైలో ఇదే చెనాబ్ నదిపై 1,856 మెగావాట్ల సవాల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ టెండర్లు పిలిచిన కొన్ని నెలల జరిగింది. ఇండస్ జల ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు, పశ్చిమ నదులపై భారత్‌కు కేవలం నీటిని వినియోగించకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒప్పందం నిలిపివేయబడినప్పటికీ, కొత్తగా ఆమోదించిన ప్రాజెక్టులన్నీ ‘రన్-ఆఫ్-ది-రివర్’ విధానంలోనే ఉండటం గమనార్హం.
ఈ 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్–2 ప్రాజెక్టుకు ఈ నెలలో జరిగిన 45వ సమావేశంలో పర్యావరణ కమిటీ ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు రూ.3,200 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే మార్గం సుగమమైంది. కమిటీ నివేదిక ప్రకారం.. చెనాబ్ నది నీరు భారత్–పాకిస్థాన్ మధ్య పంచుకుంటున్నప్పటికీ.. ఈ ప్రాజెక్టు రూపకల్పన ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉందని పేర్కొన్నారు. అయితే, 2025 ఏప్రిల్ 23 నుంచి ఇండస్ జల ఒప్పందం నిలిపివేయబడిన విషయాన్ని కూడా కమిటీ గుర్తించింది. దుల్హస్తీ స్టేజ్–2 ప్రాజెక్టు, 2007 నుంచి విజయవంతంగా పనిచేస్తున్న 390 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్–1 ప్రాజెక్టుకు పొడిగింపుగా రూపొందించారు. స్టేజ్–1 నుంచి నీటిని ప్రత్యేకంగా నిర్మించే 3,685 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు గల సొరంగం ద్వారా మళ్లించి, కొత్త జలాశయం ఏర్పాటుచేస్తారు. ఇందులో రెండు 130 మెగావాట్ల యూనిట్లతో భూగర్భ విద్యుత్ కేంద్రం నిర్మించనున్నారు. మొత్తం ప్రాజెక్టుకు 60.3 హెక్టార్ల భూమి అవసరం కాగా, అందులో 8.27 హెక్టార్లు కిష్త్వార్ జిల్లాలోని బెంజ్వార్, పాల్మార్ గ్రామాల నుంచి సేకరిస్తారు. ఇండస్ జల ఒప్పందం నిలిపివేసిన తర్వాత, దుల్హస్తీ, సవాల్కోట్ మాత్రమే కాకుండా రాట్లే, బర్సార్, పాకల్ దుల్, క్వార్, కిరు, కిర్తాయ్–1, కిర్తాయ్–2 వంటి అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులను కూడా భారత్ ముందుకు తీసుకెళ్తోంది. సవాల్కోట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం “జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు”గా ప్రకటించింది. మరోవైపు.. ఈ అంశంపై పాకిస్థాన్ స్పందించింది. ఇప్పుడు ఆ దేశం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. నీటిని అడ్డుకోవడం “యుద్ధ చర్య”గా పరిగణిస్తామని పాక్ హెచ్చరించింది. తర్వాత ఒప్పందాన్ని పునరుద్ధరించాలని, నిబంధనలపై చర్చించేందుకు సిద్ధమని భారత్‌ను కోరింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి కూడా లేఖ రాసి, భారత్ నీటిని ఆయుధంగా మారుస్తోందని పాకిస్థాన్ ఆరోపించింది. చెనాబ్, జెలమ్, నీలమ్ నదుల నీటి ప్రవాహం అకస్మాత్తుగా తగ్గడం వల్ల రబీ పంటల సాగుకు ముప్పు ఏర్పడుతుందని పాకిస్థాన్ పేర్కొంది. ఈ నీటి సరఫరాలో దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడితే, అది తమ ఆహార భద్రతకు, జీవనోపాధికి తీవ్ర ప్రమాదమని పాకిస్థాన్ వివరించింది.