India Stars Pull Out of India Champions vs Pakistan Champions Match: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా నేడు ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూసీఎల్ 2025లో భారత్, పాక్ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. దాయాది దేశాలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరగడం డౌటే అని ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఇండియా ఛాంపియన్స్ నలుగురు ప్లేయర్స్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగారని పేర్కొంది.
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా, మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్‌లు డబ్ల్యూసీఎల్ 2025లో పాకిస్తాన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. భారత మాజీలు తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పహల్గామ్ దాడి, ఆ తరువాత జరిగిన పరిణామాలు వారి నిర్ణయంకు కారణం అని తెలుస్తోంది. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నారని సమాచారం. ఇర్ఫాన్ పఠాన్ కూడా మ్యాచ్ నుంచి వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మ్యాచ్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కెప్టెన్ యువరాజ్ సింగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడట. రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వినయ్ కుమార్ వంటి భారత మాజీలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పహల్గామ్ దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
భారత ఛాంపియన్స్ జట్టు:
యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ సింగ్ కౌల్, మగన్‌కీర్కీ.