Akash Deep set for Test debut in Ranchi: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు భారత్ తరఫున అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్ ప్లేయర్ రజత్ పాటిదార్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో రజత్‌కు అవకాశం రాగా.. రాజ్‌కోట్ టెస్టులో సర్ఫరాజ్, జురెల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక నాలుగో టెస్టు సందర్భంగా మరో ఆటగాడి అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇంగ్లండ్‌తో తొలి మూడు టెస్టుల్లో అదరగొట్టిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బుమ్రా స్థానంలో ముకేశ్ కుమార్‌ను మరోసారి జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే నాలుగో టెస్ట్ తుది జట్టులో ముకేశ్‌ను కాకుండా.. ఆకాశ్ దీప్‌ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఆకాశ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మొహమ్మద్ సిరాజ్‌తో ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను ఆకాశ్ పంచుకోనున్నాడు.
Also Read: Shubman Gill: బయటి వాళ్లు ఏమన్నా నేనేమీ పట్టించుకోను!
విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో 12 ఓవర్లు బౌలింగ్ చేసిన ముకేశ్ కుమార్.. ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అది కూడా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పదో నంబర్ బ్యాటర్ షోయబ్ బషీర్‌ను ఔట్ చేశాడు. టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన ముకేశ్ కుమార్ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. మరోవైపు భారత్-ఎ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య మ్యాచ్‌ల్లో ఆకాశ్ దీప్ బౌలింగ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లను ఆకట్టుకుంది. లయన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ ఇప్పటివరకు 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 104 వికెట్లు పడగొట్టాడు.