Mayank Yadav bowled a Maiden Over in his debut match: పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆదివారం గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో మయాంక్ అరంగేట్రం చేశాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. బంగ్లా బ్యాటర్లను హడలెత్తించాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. 21 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అయితే ఈ పేస్ సంచలనం తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత నమోదు చేశాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ తాను వేసిన తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించాడు. బంగ్లా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మయాంక్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ ఓవర్ వేసిన మూడో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (2006), టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (2022) ముందున్నారు. అగార్కర్ 2006లో దక్షిణాఫ్రికాపై, అర్ష్‌దీప్ 2022లో ఇగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించారు. వన్డేల్లో ఖలీల్ అహ్మద్ (2018), నవదీప్ సైనీ (2019) తన అరంగేట్ర మ్యాచ్‌లో మెయిడెన్ వేశారు.
Also Read: Harmanpreet Kaur Injury: హర్మన్‌ప్రీత్‌కు ఏమైంది?.. శ్రీలంక మ్యాచ్‌లో ఆడుతుందా?
2024 ఐపీఎల్‌లో సంచలన పేస్‌తో మయాంక్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. లక్నో తరఫున నాలుగు మ్యాచ్‌లే ఆడినా.. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. ఏడు వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా మయాంక్ ముందుగానే టోర్నీని వీడాల్సి వచ్చింది. గాయం నుంచి కోలుకున్న అతడు తొలి టీ20లో బంగ్లా బ్యాటర్లను వణికించాడు. భారత జట్టుకు ప్రధాన పేసర్‌గా ఎదిగే సత్తా మయాంక్‌కు ఉంది.