బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 గురించి సోషల్ మీడియాలో తన పేరు, ఫొటో దుర్వినియోగం కావడంపై టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించారు. కొందరు సోషల్ మీడియాలో తన ఫొటోను ఉపయోగించి.. నచ్చినట్టుగా వార్తలు రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చినవన్నీ నకిలీ వార్తలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో చూసే ప్రతిదాన్ని నమ్మొద్దని కుంబ్లే తెలిపారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఉన్న విషయం తెలిసిందే. పెర్త్, అడిలైడ్ మైదానాల్లో రెండు టెస్టులు ముగియగా.. ప్రస్తుతం గబ్బాలో మూడో టెస్టు జరుగుతోంది. ఈ సిరీస్ నేపథ్యంలో కొన్ని రోజులుగా కొందరు సోషల్ మీడియాలో అనిల్ కుంబ్లే ఫొటోను ఉపయోగించి.. నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ వైఫల్యం, రోహిత్ శర్మ కెప్టెన్సీపై జంబో విమర్శలు చేశాడని న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఆ న్యూస్ కుంబ్లే వరకు చేరడంతో.. తాజాగా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసి అవన్నీ తన వ్యాఖ్యలు కావని, అంతా ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు.
‘కొందరు కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో నా ఫొటోని ఉపయోగించి అసత్య వార్తలను ప్రచారం చేయడం నా దృష్టికి వచ్చింది. ఆ ఎక్స్ ఖాతాలు, వాటిలో వచ్చిన వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో చూసే ప్రతిదాన్నిఅస్సలు నమ్మొద్దు. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు అది సరైనదో కాదో ధ్రువీకరించుకోండి. నా అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి’ అని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఎక్స్‌లో పేర్కొన్నారు.