Rains and Thunderstorms: అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.. అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.. ఇక, ఈ రోజు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రకటించారు.. విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, ఇవాళ మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల సంస్థ.. పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని.. రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.. మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎవరూ చెట్ల కింద ఉండరాదని.. ముఖ్యంగా వర్షం వచ్చే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్.