దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అయితే తాజాగా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏప్రిల్ 20-24 వరకు ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గాలులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక ఏప్రిల్ 20-21 తేదీల్లో గంగా పశ్చిమ బెంగాల్, ఒడిశాలో హీట్ వేవ్ కొనసాగుతుందని హెచ్చరించింది. అటు తర్వాత క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: BC Janardhan Reddy: బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం..!
ఇక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇక ప్రజలు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా.. సూర్యరశ్మికి దూరంగా ఉండాలని.. చల్లని ప్రాంతాల్లో ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. భారీ వర్షాలు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉన్న కారణాన అధికారులు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: Kashi Express: ఏసీ కోచ్‌లో రద్దీ, హైజాక్ చేశారంటూ ప్రయాణికుడి ఆవేదన.. వైరల్ వీడియోపై స్పందించిన రైల్వే..
ఇక ఏప్రిల్ 20న తెలంగాణలో వడగళ్ల వానలు పడొచ్చని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే శనివారం ఉదయం హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా ఉక్కపోతతో అల్లాడుపోతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. చల్లని గాలులతో ప్రజలు ఉల్లాసం పొందుతున్నారు. వేడిగాలుల నుంచి కొంత ఉపశమనం లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bhaje Vaayu Vegam: ఆసక్తి రేకెత్తించే “భజే వాయు వేగం” టీజర్