Illegal Mining of Colored Stones: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్‌లో రంగురాళ్ల తవ్వకాలను జోరుగా సాగుతున్నాయి. వర్షాలు కురుస్తుండటం తవ్వకాలకు అనుకూలంగా మారింది. రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం పరిధిలోని 10 క్వారీల్లో తవ్వకాలు చేపట్టారు. అటవీ భూముల్లోనే కాకుండా రైతుల పట్టా భూముల్లోనూ రంగురాళ్లు దొరుకుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. గతంలో ప్రమాదాలు జరిగి అనేక మంది గిరిజనులు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో విలువైన నీలి రంగు, అలెక్స్, ఆకుపచ్చ, కెంపు, క్యాట్ ఐ, మొదలైన రకాల రంగు రాళ్లు దొరుకుతాయి. వీటికోసం విశాఖ, సింగపూర్ నుంచి వ్యాపారులు ఎగబడుతున్నారు.
Read Also: Ladakh Violence: లడఖ్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ నేత హస్తం! ఫొటోలు బయటపెట్టిన బీజేపీ
అటవీ, పోలీసు అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యి గిరిజనులతో తవ్వకాలు ప్రారంభించారు. కోట్ల రూపాయల్లో రంగు రాళ్ల విక్రయాలు జరుగుతున్నాయి. గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు. పొట్టకూటి కోసం తవ్వకాలకు వెళ్లుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు స్థానికంగా తిష్ట వేసి రంగురాళ్లను తవ్విస్తున్నారు. గిరిజనులకు వ్యాపారులు ఇచ్చేది రోజుకు 500 రూపాయలే. ప్రతీ ఏటా వ్యాపారులు మాత్రం లక్షలాది రూపాయల విలువచేసే రంగురాళ్లను పట్టుకొని వెళుతున్నారు. వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రంగురాళ్ల తవ్వకాలను నిలిపేయాలని కోరుతున్నారు జిల్లా వాసులు. గిరిజనులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా.. రంగురాళ్ల కోసం తవ్వకాలు సాగిస్తే.. వారికి రూ.500 కూలి ఇచ్చి.. లక్షలు, కోట్లు వెనకేసుకుంటున్నారు వ్యాపారులు..