IIT Bombay: ఐఐటీ – బాంబే మరోసారి వార్తల్లో నిలిచింది. గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిన ఓ ప్రొఫెసర్ పాలస్తీనా ఉగ్రవాదులను కీర్తించడం వివాదాస్పదం అయింది. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న జరిగిన దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐఐటీ బాంబేలోని హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్(హెచ్ఎస్ఎస్) విభాగానికి చెందిన ప్రొఫెసర్ శర్మిష్ట సాహా ‘ హెచ్ఎస్ 835 పెర్ఫామెన్స్ థియరీ అండ్ ప్రాక్సిస్’ అనే అకడమిక్ కోర్సు కోసం గెస్ట్ స్పీకర్‌గా సుధన్య దేశ్‌పాండేని ఆహ్వానించారు. రాడికల్ లెఫ్టిస్ట్ దేశ్‌పాండేని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని సాహా అనుచితంగా ఉపయోగించుకున్నారని విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Israel-Hamas War: హమాస్ కీలక కమాండర్లను హతమార్చిన ఇజ్రాయిల్.. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిపై దాడి..
దేశ్‌పాండే పాలస్తీనా ఉగ్రవాదులు జకారియా జుబేదీ, ఘసన్ కనాపానీలను కీర్తించారని, సాయుధ తిరుగుబాటును సమర్థించారని విద్యార్థులు ఆరోపించారు. అతను 2015లో పాలస్తీనా తీవ్రవాది జుబేదీని కలిసినట్లు ఒప్పుకున్నారని, హింస, సాయుధ తిరుగుబాటును ప్రశంసించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. జుబేదిని అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయిల్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. ఇలాంటి ప్రసంగాలు విద్యార్థులపై ప్రభావం చూపిస్తాయని చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఇజ్రాయిల్ కాన్సులేట్ జనరల్ కొబ్బి శోషని స్పందించారు. ఐఐటీ బాంబేలో ఉగ్రవాదులను కీర్తించడం షాక్‌కి గురిచేసిందని అతను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. విద్యార్థులు అలర్టై వారిని పట్టుకున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు, అక్కడికి వెళ్లి వాస్తవాలను పంచుకోవాడానికి నేను సంతోషిస్తానని శోషని ట్వీట్‌లో పేర్కొన్నారు. సుధన్వ దేశ్ పాండే మాట్లాడుతూ.. పాలస్తీనా పోరాటం స్వేచ్ఛకోసమని, స్వాతంత్రోద్యమంతో సహా ప్రపంచంలో ఇలాంటి పోరాటం లేదని పొగడటం వీడియో కనిపిస్తుంది.