US Warns China: రష్యాకు చైనా ఆయుధాలను సరఫరా చేయడాన్ని అమెరికా పరిశీలిస్తోందని, ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుందని, తీవ్రపరిణామాలు ఉంటాయని యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణకు దాని మద్దతుకు సంబంధించి తాము మొదటి నుంచి చైనాకు చెబుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు సాయాన్ని అందిస్తే చైనాపై ఆంక్షలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఈ విషయమై ముఖ్యంగా జీ7 సముహంలోని దేశాల మద్దతు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా ఏవిధమైన ఆంక్షలు విధించాలనుకుంటదనేది స్పష్టం కాలేదు. ఇటీవల రష్యాకు ఆయుధాలు అందించడానికి చైనా యత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపణలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. అలాగే ఈవిషయమై అమెరికా ఎలాంటి ఆధారాలను చూపలేదు.
చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్‌యిని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. రష్యాకు ఆయుధాలను సరఫరా చేయాలని చైనీయులు ఆలోచిస్తున్నారనే సమాచారంపై ఆయన వద్ద తమ ఆందోళనను లేవనెత్తానని బ్లింకెన్ చెప్పారు. ఇలా ఆయుధాలు సరఫరా చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం భారత్‌కు వచ్చిన బ్లింకెన్ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కూడా కలిశారు. జైశంకర్, బ్లింకెన్ సంబంధాలను సమీక్షించారు. ప్రపంచ సమస్యలపై చర్చించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో క్లుప్తంగా మాట్లాడినట్లు కూడా బ్లింకెన్ ధృవీకరించారు.
Read Also: Putin: పుతిన్ వైభోగం మామూలుగా లేదుగా.. రూ.990 కోట్ల ఎస్టేట్‌లో లవర్‌తో రహస్య జీవనం
రష్యా తన బాధ్యతారాహిత్య నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, యునైటెడ్ స్టేట్స్, రష్యన్ ఫెడరేషన్ అణు ఆయుధాలపై ధృవీకరించదగిన పరిమితులను ఉంచే న్యూ స్టార్ట్ ఒప్పందాన్ని అమలులోకి తీసుకురావాలని రష్యాను కోరినట్లు ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. పరస్పర సమ్మతి రెండు దేశాల ప్రయోజనాలకు సంబంధించినదని పేర్కొన్నారు. చాలా దేశాలు కూడా ఈ నిర్ణయం గురించి చూస్తున్నాయన్నారు. రష్యాకి యుద్ధ సామగ్రి తక్కువగా ఉండటంతో చైనా నుంచి ఆయుధ సరఫరా రష్యాకి అనుకూలంగా మారతుందని ఉక్రెయిన్ మద్ధతుదారులు భయపడుతున్నారు. ఐతే ఫిబ్రవరి 24 జీ7 ప్రకటనలో ఉక్రెయిన్‌పై దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా.. రష్యా యుద్ధానికి అవసరమైన వస్తుపరమైన సాయాన్ని అందించకూడదు లేదంటే దీనికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది.