తెలంగాణలో గొల్లలు, కుర్మలు వేరని దుష్ప్రచారం చేశారని.. కానీ గొల్లలు, కుర్మలు ఒక్కటే అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గొల్ల, కుర్మల తరుపున తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. గొల్ల, కుర్మలు లేకుండా ఇప్పటి వరకు కేబినెట్ లేదని.. ఈసారి కూడా మంత్రి వర్గంలో గొల్ల, కుర్మలకు చాన్స్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాం అని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ని కలిసి గొల్ల, కుర్మలకు పార్టీలో, మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు.
‘గొల్ల, కుర్మలకు మంత్రి వర్గంలో, పార్టీ పదవులలో అవకాశం ఇవ్వాలి. గొల్ల, కుర్మలకు ఒక మంత్రి పదవి, ఒక అడ్వైజర్, ఒక ఎమ్మెల్సీ, ఐదు నామినేటెడ్ కార్పొరేషన్లు, ఐదు కమిషన్ సభ్యులు, ఒక వర్కింగ్ప్రెసిడెంట్, మూడు వైస్ ప్రెసిడెంట్లు, ఎనమిది ప్రధాన కార్యదర్శులు, ఐదు డీసీసీలు ఇవ్వాలి. తెలంగాణలో గొల్ల, కుర్మలు 28 లక్షలు ఉన్నారు. ఇందులో గొల్లలు 6 లక్షలు, కుర్మలు 22 లక్షలు ఉన్నారు. గొల్లలు, కుర్మలు వేరని దుష్ప్రచారం చేశారు. కానీ గొల్లలు, కుర్మలు ఒక్కటే. గొల్ల, కుర్మల తరఫున నేను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నా. గొల్ల, కుర్మలు లేకుండా ఇప్పటి వరకు కేబినెట్ లేదు. ఈసారి కూడా మంత్రి వర్గంలో గొల్ల, కుర్మలకు చాన్స్ ఇవ్వాలి’ అని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు.
Also Read: Kagiso Rabada: దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ రబాడ!
‘మాకు జనాభా ప్రకారం అవకాశాలు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాం. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ.. గొల్ల, కుర్మలకు కూడా అవకాశాలు ఇవ్వాలి. మా గొల్ల, కుర్మలకు న్యాయం చేస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది. విద్యా, రాజకీయ, ఉపాధి అవకాశాలలో 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే’ అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.