AV Ranganath : ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని క్షణాల్లో హైడ్రా (Hydra)కు చేరేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే వద్ద షేక్‌పేట ప్రాంతంలోని డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదానికి గల కారణాలను హైడ్రా డీఆర్ఎఫ్ (Hydra DRF) బృందం , ఫైర్ సిబ్బందితో చర్చించారు.
డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం భవన రెండో అంతస్తులో ప్రారంభమై ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్ (Akash Institute) నడుస్తున్న ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ ఘటనపై రంగనాథ్ మాట్లాడుతూ, అగ్నిమాపక దళాలు , హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సమయానికి చేరుకోవడంతో మంటలను రెండో అంతస్తు పరిధిలోనే అడ్డుకోవడం సాధ్యమైందని ప్రశంసించారు. అయితే, అగ్ని ప్రమాదం కారణంగా భవనంలోని మొత్తం రెండు సెల్లార్లు, నాలుగు పై అంతస్తుల్లో పొగ వ్యాపించినట్లు స్పష్టం చేశారు.
Saif Ali Khan: ‘‘మరో 2 మి.మీ. కత్తి లోతుగా దిగి ఉంటే..’’ సైఫ్ పరిస్థితిపై డాక్టర్లు..
అగ్ని ప్రమాదాల నివారణకు సూచనలు:
రంగనాథ్, భవన యజమానులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. భవనంలో అగ్నిప్రమాదం ప్రారంభమైన క్షణాల్లో అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రమాద సమాచారం హైడ్రా డీఆర్ఎఫ్‌కు తక్షణమే చేరే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆధునిక పద్ధతులను అమలు చేయాలని సూచించారు. భవనంలో ఫైర్ అలారమ్ వ్యవస్థ ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
అగ్నిప్రమాదానికి గల నిజమైన కారణాలను తెలుసుకునేందుకు భవనంలోని సీసీ టీవీ ఫుటేజీని సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భవన యజమానులు , నిర్వహణ సిబ్బంది భవిష్యత్‌లో అలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనలో హైడ్రా డీఆర్ఎఫ్ , ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల నష్టం కొంతమేర తగ్గిందని రంగనాథ్ వెల్లడించారు. ఇటువంటి విపత్తులను ముందుగానే అరికట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Purandeswari: చంద్రబాబు, అమిత్‌షా భేటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..