మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను వద్ద హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. సున్నం చెరువు పరిధిలో అక్రమంగా వెలిసిన గుడిసెలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించేస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా రూ. 10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు వెలుగుచూశాయి. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగిస్తున్నారు. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం కొనసాగుతోంది. ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా సూచించిన విషయం తెలిసిందే.
Also Read:Vishnu: మంచు విష్ణు తదుపరి చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్.. !
సున్నం చెరువును పునరుద్ధరించే క్రమంలో హైడ్రా.. ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) ద్వారా పరీక్షించింది. తాగునీటిగా సరఫరా చేస్తున్న ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేయించింది. సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు అధికంగా ఉన్నాయని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదులో కాకుండా.. రెండింతలు, మూడింతలు, 12 రెట్లు అధికంగా ఉండి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని పీసీబీ పరిశోధనల్లో వెల్లడైంది.