Indira Canteen: హైదరాబాద్‌లోని పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిరా క్యాంటీన్’ (Indira Canteen)పథకాన్ని ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఈ పథకం ద్వారా కేవలం ఐదు రూపాయలకే అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్), ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం అందించనున్నారు. మోతీనగర్, మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కూడా పాల్గొన్నారు.
ఈ పథకం కింద ఒక్కో అల్పాహారంపై జీహెచ్‌ఎంసీ రూ. 14, మధ్యాహ్న భోజనంపై రూ. 24.83 భరించనుంది. దీని వల్ల ఒక్కో వ్యక్తిపై నెలకు సుమారు రూ. 3,000 ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అల్పాహారం కోసం ‘హరే రామ, హరే కృష్ణ’ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సాధారణంగా రూ. 19 ఖర్చయ్యే టిఫిన్‌ను కేవలం రూ. 5కే, అలాగే రూ. 30 ఖర్చయ్యే భోజనాన్ని రూ. 5కే అందిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మొదటగా ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా.. గత 10 సంవత్సరాలుగా లేని రేషన్ కార్డులు తమ ప్రభుత్వం అందించిందని, అలాగే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. అంతేకాకుండా మహిళా సాధికారత కోసం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల యజమానులుగా చేసే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. మహిళా సంఘాల్లో సభ్యుల సంఖ్యను 16 నుంచి 65 వరకు మార్చి, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నామని చెప్పారు.
Surya Kumar Yadav: ఇది కదా కెప్టెన్సీ అర్థం! నా నిజమైన ట్రోఫీలు.. నా జట్టు సహచరులే అంటూ..
అంతేకాకుండా.. హైదరాబాద్‌లో పనిచేసే వారికి అక్కడే ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని.. కొల్లూరులో ఇళ్లు నిర్మించి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఇందిరా క్యాంటీన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.