స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరగాళ్ల పని ఈజీ అవుతోంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సులభంగా జనాన్ని బురిడీ కొట్టించేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు సైబర్ వలకు చిక్కిన అమాయకులు.. డబ్బులు నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డులో ఓ మహిళ సైబర్ నేరగాళ్లకు చిక్కి ఉసురు తీసుకుంది.
ఆన్‌లైన్‌లో అమాయకులు తగిలితే చాలు.. ఇట్టే మోసం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడంపై అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. ఇలాంటి వాటినే ప్రకటనలుగా మారుస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఆశలు కల్పిస్తున్నారు. పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదంటారు. కొంచెం పని చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఊరిస్తూ సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేస్తారు. వాటిని చూసి బుట్టలో పడిన వారిని బురిడీ కొట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాగే కూకట్‌పల్లిలో ఉంటున్న అనూష అనే మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడిపోయింది. వర్క్ ఫ్రమ్ హోం ప్రకటన చూసి లింక్ క్లిక్ చేసి జాయిన్ అయింది. ఇంకేముంది అనూష వద్ద లక్ష రూపాయలు కొట్టేశారు సైబర్ క్రిమినల్స్. దీంతో మోసపోయిన మనస్తాపంతో ఆమె సూసైడ్ చేసుకుంది.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కంచుస్తంభం పాలెంవాసి అనూషకు దగ్గరి బంధువైన వెంకన్నబాబుతో ఐదేళ్ల కిందట వివాహమైంది. కుమారుడు ఉన్నాడు. హైదరాబాద్ KPHB తులసీనగర్లో ఉంటున్నారు. అనూష టెలిగ్రామ్ యాప్‌లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ ప్రకటన చూసి ఫాలో అయింది. ముందు వెయ్యి రూపాయలు కట్టింది. దీంతో ఆమెకు రూ. 7 వేలు వచ్చినట్టు యాప్‌లో చూపెట్టారు. తరువాత డబ్బులు కనిపిస్తున్నా బ్యాంకు ఖాతాలోకి మాత్రం బదిలీ కాలేదు. ఇంకా డబ్బులు సంపాదించాలంటే కొంత పెట్టుబడి పెట్టాలని చెప్పారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చిన టాస్కులకు ఆకర్షితురాలైన తన దగ్గర ఉన్న బంగారం అమ్మి పెట్టుబడి పెట్టింది. ఇలా సుమారు లక్ష వరకు పెట్టుబడులు పెట్టింది. పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని భావించింది. కానీ చివరికి తాను పెట్టిన పెట్టుబడులు తిరిగి రావని గుర్తించింది. సైబర్ నేరగాళ్ల మోసానికి బలి అయ్యానని కలత చెందింది. కుమారుడిని నిద్రపుచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది అనూష. ఆత్మహత్యకు ముందు తన మాదిరి టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని, బాబు జాగ్రత్త అంటూ లేఖ రాసింది. ఒక వీడియో మెసేజ్ ని కూడా పంపించింది టెలిగ్రామ్ యాప్ మొత్తం మోసాల పుట్టని పేర్కొంది.
మరో కేసులో 65 ఏళ్ల వృద్ధున్ని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. వృద్దుడు.. LGBT యాప్‌లో ఓ యువకుడితో చాటింగ్ చేశాడు. రెండు రోజుల తర్వాత వృద్ధున్ని అమీర్‌పేట్‌లోని ఓ హోటల్ గదికి పిలిపించాడు యువకుడు. గదిలో ఇద్దరు నగ్నంగా ఉన్న సమయంలో బయటి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. దాన్ని బయటపెడతామని బెదిరించి ఇద్దరి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇందులో ఆ యువకుడు ముఠాలోని వ్యక్తే. కొద్దిరోజులకు వృద్ధుడికి ఫోన్ చేసిన ఆగంతకులు మరో రూ.20 వేలు ఇవ్వకుంటే ఆ వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామంటూ బెదిరించారు. దీంతో బాధితుడు పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కొందరిని హోటల్, నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి సొమ్ము వసూలు చేసినట్టు తేల్చారు.
మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు, నల్లకుంటకు చెందిన ఒకరు ముఠాగా ఏర్పడ్డారు. ఎల్‌జీబీటీ యాప్‌లో స్వలింగ సంపర్కులుగా సభ్యత్వం తీసుకున్నారు. వీరితో చాటింగ్ చేసిన వారిని హోటల్ గదికి ఆహ్వానిస్తారు. ఒకరు గదిలో ఉంటే.. ఇద్దరు బయట ఉంటారు. గదిలోకి వెళ్లిన బాధితుడు నగ్నంగా మారగానే బయట ఉన్న ఇద్దరు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తూ లోపలకు వెళ్తారు. ఇద్దర్నీ బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ముఠాలోని సభ్యుడు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేసినట్టు నకిలీ ఆధారాలు చూపుతాడు. ఇది నిజమని బాధితుడు తన వద్దనున్న డబ్బు ఇచ్చి తప్పించుకుంటాడు.
సైబర్ నేరగాళ్లు.. ప్రతి అవకాశాన్ని వాడుకుంటారని పోలీసులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెబుతున్నారు. లేనిపక్షంలో ఈజీగా మోసపోవడం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు.