North Korea ICBM: అగ్రరాజ్యం అమెరికా-ఉత్తర కొరియా మధ్య వైరం ఇప్పటిది కాదు. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో అక్టోబర్ 10న గొప్ప సైనిక కవాతు జరిగింది. ఈ సైనిక కవాతులో వేలాది మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు, క్షిపణులను ప్రదర్శించారు. మొదటిసారిగా ఉత్తర కొరియా హ్వాసాంగ్-20 క్షిపణి ఆవిష్కరించింది. అమెరికాకు వ్యతిరేకంగా ఈ ఆయుధాన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కిమ్ జోంగ్ ఉన్ అభివర్ణించారు. కవాతులో హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనం కూడా ప్రదర్శించారు. ఈ సైనిక కవాతులో రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి, చైనా వైస్ చైర్మన్ హాజరయ్యారు.
READ ALSO: DONALD TRUMP: ట్రంప్‌కు హఠాత్తుగా చైనాపై కోపం.. 100 శాతం టారిఫ్ ఎందుకు.?
అమెరికా గద్దెను కదలించే ఆయుధం..
ఉత్తర కొరియా తన అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ క్షిపణి అయిన హ్వాసొంగ్-20ని ఈ కవాతులో మొదటిసారి ఆవిష్కరించింది. ఇది మొత్తం అమెరికాను ఢీకొట్టగల ఘన ఇంధనంతో నడిచే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM). కిమ్ జోంగ్ ఉన్.. దీనిని మొత్తం అమెరికాను ఢీకొట్టగల అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ వ్యవస్థగా పేర్కొన్నారు. వర్కర్స్ పార్టీ 80వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10న జరిగిన సైనిక కవాతులో ఉత్తర కొరియా ఈ క్షిపణిని ఆవిష్కరించింది.
హ్వాసొంగ్-20 ప్రత్యేకతలు..
హ్వాసొంగ్-20 అనేది ఉత్తర కొరియా అత్యంత అధునాతన ICBM. ఇది మూడు దశల ఘన-ఇంధన క్షిపణి. ఇది ప్రయోగించిన తర్వాత వేగంగా ఎత్తుకు చేరుకుంటుంది. ఇది కొత్త హై-థ్రస్ట్ ఘన-ఇంధన ఇంజిన్ కలిగి ఉంది. ఈ అత్యంత అధునాతన ICBM క్షిపణి హ్వాసొంగ్-18 కంటే 40% ఎక్కువ శక్తివంతమైనది (సుమారు 1,970 kN థ్రస్ట్). ఇది క్షిపణి వేగంగా, ఎక్కువ దూరం ప్రయాణించగలదు.
పరిధి: 15,000 కిలోమీటర్ల వరకు.. ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి US లోని ఏ మూలనైనా కవర్ చేస్తుంది.
వార్‌హెడ్: బహుళ స్వతంత్రంగా లక్ష్యంగా చేసుకోగల రీ-ఎంట్రీ వాహనాలను (MIRV) మోసుకెళ్లగలదు. అంటే ఒకే క్షిపణి నుంచి బహుళ అణు వ్యవస్థలు వేర్వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి.
పొడవు: సుమారు 25 మీటర్లు (అంచనా), బరువు 80 టన్నుల కంటే ఎక్కువ.
లాంచ్: మొబైల్ లాంచర్ నుంచి కూడా చేయవచ్చు. దీని లాంచర్‌ను దాచడం చాలా సులభం.
కవాతులో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ..”ఇది మా అత్యంత శక్తివంతమైన అణ్వాయుధం” అని పేర్కొన్నారు. ఈ క్షిపణిని ఇంకా పరీక్షించలేదు, కానీ నిపుణులు ఇది హ్వాసంగ్-18 కంటే చాలా ఉన్నతమైనదని చెబుతున్నారు. ఘన ఇంధనంతో నడిచే దీనిని తక్షణమే ప్రయోగించవచ్చు, దీనితో హెచ్చరిక లేకుండా దాడి చేయడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
ప్రపంచానికి ముప్పులు..
హ్వాసొంగ్-20 మొత్తం అమెరికా ప్రధాన భూభాగాన్ని (అలాస్కా నుంచి ఫ్లోరిడా వరకు) లక్ష్యంగా చేసుకోగలదు. ఒకే MIRV క్షిపణి బహుళ నగరాలను ఢీకొట్టగలదు. ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని అమెరికా పెంటగాన్ పేర్కొంది. ఉత్తర కొరియా వద్ద 50-60 అణ్వాయుధ వార్‌హెడ్‌లు ఉన్నాయి. రోజురోజుకు వాటి సంఖ్య పెరుగుతోంది. ఇది రష్యా, చైనా ఉనికితో కలిపి ఆసియాలో ఉద్రిక్తతలను పెంచుతుంది. ఈ క్షిపణి రాకతో దక్షిణ కొరియా, జపాన్ కూడా ఆందోళన చెందుతున్నాయి.