Bhagavadgita Foundation: ప్రసిద్థ గాయకులు, గీతాగాన, ప్రవచన, ప్రచారకర్త ఎల్. వి. గంగాధర శాస్త్రికి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లోని ‘మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం’ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది.
భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో భాగంగా భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతలోని 700 శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేయడమే కాకుండా స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారమే తన జీవితంగా మలుచుకున్నందుకు గంగాధర శాస్త్రికి గౌరవ డాక్టరేట్ ప్రకటించినట్టు పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.జి. విజయకుమార్ తెలిపారు. మే 24వ తేదీ ఉదయం 11 గంటలకు కోఠి మార్గ్ లోని విక్రమ్ కీర్తి మందిరం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్)లో జరిగే మహర్షి పాణిని సంస్కృత్ ఏవం వేదిక్ విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవంలో ఆయనను గౌరవ డాక్టరేట్ తో సన్మానించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ గవర్నరు, కులపతి మంగుభాయ్ పటేల్ కు, ఉప కులపతి విజయకుమార్ కు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు, ఉన్నత విద్యాశాఖామంత్రి మోహన్ యాదవ్ కు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు. భగవద్గీత ఫౌండేషన్ ద్వారా తాను 17 సంవత్సరాలుగా చేస్తున్న కృషిని గుర్తించిన భారతీయ జనతాపార్టీ మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ పి. మురళీధర రావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా తనకీ గౌరవం దక్కిందని, అందుకు ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. కొన్నేళ్ళుగా భగవద్గీత ఫౌండేషన్ ద్వారా తాము ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగాలలో కృషి చేస్తున్నామని చెబుతూ, ‘మతాలకు అతీతంగా జ్ఞాన గ్రంథం ‘భగవద్గీత’ను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని, గీతను బాల్యదశ నుండే పిల్లలకు నేర్పించాల’ని గంగాధర శాస్త్రి కోరారు.