టీడీపీ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. తన పిల్లలను కూడా పక్కన పెడతాను అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తన పీఏ సంధు జగదీష్‌పై అవినీతి ఆరోపణలు, వేటు నేపథ్యంలో హోంమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. తన పీఏను చాలాసార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదని, అందుకే తానే స్వయంగా తొలగించానని చెప్పారు. నేడు విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత సందర్శించారు. ఇటీవల జైల్లో జరుగుతున్న పరిణామాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు.
‘గత నెల రోజులుగా ఏదో ఒక వార్తల్లో విశాఖ సెంట్రల్ జైల్ నిలుస్తోంది. గంజాయి సరఫరా జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టి కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. మేము అధికారంలోకి వచ్చాక ప్రతిదీ గమనిస్తున్నాం. అనేక కేసుల్లో నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సెల్ ఫోన్లు దొరకడం వాటిపై ఆరా కూడా తీస్తున్నాం. కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు. బయటకు వెళ్లి వచ్చేటపుడు గంజాయి తీసుకొస్తున్నారు. సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క కూడా కనిపించింది. 1,075 మంది గంజాయి కేసుల్లో నిందితులు ఉన్నారు’ అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
‘జైలు వార్డర్లు యూనిఫామ్‌లో ఉండి ఆందోళన చేయడం సరైంది కాదు. లోపల సవ్యంగానే తనిఖీలు చేపట్టాం. రూల్ ప్రకారమే బదిలీలు జరిగాయి. సిబ్బంది కొరత కూడా ఉంది. దొరికిన సెల్ ఫోన్లు ఎవరివి అనే దానిపై ఎంక్వయిరీ కొనసాగుతుంది’ అని హోంమంత్రి చెప్పారు. అనంతరం తన పీఏ సంధు జగదీష్ అవినీతి ఆరోపణలపై స్పందించారు. ‘నా ప్రయివేట్ పీఏపై ఆరోపణలు వచ్చాయి. అందుకే నా అంతటా నేనే తొలగించాను. చాలాసార్లు అలెర్ట్ చేశాను, పద్ధతి మార్చుకోలేదు. టీడీపీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే నా పిల్లలను కూడా పక్కన పెడతాను’ అని హోంమంత్రి పేర్కొన్నారు.