తెలంగాణ హోం మినిష్టర్ మహమూద్ అలీ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన ఆయన.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటల డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీఎం కేసీఆర్ అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ఆరంభించారు. అలాగే, నేడు మంత్రి తలసాని బర్త్ డే కావడంతో మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని విషెస్ తెలిపారు.
Read Also: Justin Trudeau: “నువ్వో చెత్త ప్రధానివి”..కెనడా ప్రధానిపై పౌరుడి ఆగ్రహం..
ఇక, అదే సమయంలో బోకే ఎక్కడ అంటూ తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని హోంమంత్రి మహమూద్ అలీ అడిగారు. అయితే, బోకే గురించి తెలియదని సదరు సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన మహమూద్ అలీ కానిస్టేబుల్‌ను చెంప మీద కొట్టారు. దీంతో షాక్ అయిన ఆ గన్‌మెన్ మంత్రిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఈ ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి గన్ మెన్ అందించారు.
Read Also: Kasireddy Narayan Reddy: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి కసిరెడ్డి.. కండువా కప్పిన ఖర్గే
అయితే, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హోంమంత్రి మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. హోంమంత్రి అయినంత మాత్రాన వ్యక్తిగత సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని సోషల్ మీడియాలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ధోరణి మార్చుకుంటే మంచిది లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.