Himanta Sarma’s wife files Rs 10 crore defamation suit on Gaurav Gogoi:ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పై.. హిమంత భార్య రినికి భూయాన్ శర్మ రూ.10 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఈ కేసుపై సీనియర్ అడ్వకేట్ దేవజిత్ సైకియా పీటీఐ కు తెలిపిన వివరాల మేరకు.. కామరూప్ సివిల్ జడ్జి కోర్టులో ఈ శుక్రవారం కేసు దాఖలైందని, సెప్టెంబర్ 26వ తేదీకి ఈ కేసు విచారణకు వస్తుందని తెలిపారు. ట్విట్టర్ లో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ చేసిన వరుస ట్వీట్ల ఆధారంగా తన క్లయింట్ ఈ పరువునష్టం దావా వేశారని అడ్వకేట్ దేవజిత్ సైకియా పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో తమ క్లయింట్ కు ఎలాంటి సబ్సిడీ అప్లికేషన్లు అందలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మే26న కేంద్ర ఆహార శాఖ నుంచి తన క్లయింట్ కు షోకాజ్ నోటీసు వచ్చిందని తెలిపారు. నవంబర్ 22, 2022న ప్రాజెక్టు అప్రూవ్ అవ్వగా.. ఆ ఈ మెయిల్ కు తమ ప్రపోజల్ ను సబ్మిట్ చేయలేదన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో సబ్సిడీలు పొందినట్లు గొగోయ్ చేసిన ఆరోపణలను అడ్వకేట్ దేవజిత్ సైకియా కొట్టిపారేశారు.
తన క్లయింట్ శర్మ కు చెందినప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్ మెంట్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఎంపీ గొగోయ్ చెప్పిన విషయాలు వాస్తవాలు కాదన్నారు. ప్రాజెక్టులో సబ్సిడీ పొందకుండానే వచ్చిందంటూ గొగోయ్ చేసిన ఆరోపణలు ముమ్మాటికీ అసత్యాలేనని, బహుశా గొగోయ్ దీనిపై పూర్తిగా తెలుసుకోకుండా అలాంటి ఆరోపణలు చేసి ఉంటారని అడ్వకేట్ చెప్పుకొచ్చారు. ఈ కేసులో పూర్వపరాలన్నింటినీ బయటికి తీస్తామన్నారు. కాగా.. ఈ ప్రాజెక్టు విషయమై గువాహటి డిజిటల్ మీడియాలో ఒకటైన ది క్రాస్ కరెంట్ రాసిన ఓ వార్త.. కాంట్రవర్సీకి దారితీసింది. నగౌన్ జిల్లాలోని దరిగజి గ్రామంలో .. 50 భిగాలకు పైగా.. అంటే సుమారు 17 ఎకరాల సాగుభూములు ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ కంపెనీ అవసరాల నిమిత్తం కొనుగోలు చేశారని ఆ వార్తలో రాశారు. దాని ఆధారంగానే కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కొద్దిరోజులుగా వరుస ట్వీట్లు చేస్తూ వస్తున్నారు.
ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన, వ్యవసాయ క్లస్టర్లకు మౌలిక సదుపాయాల కల్పన పదకం ప్రాజెక్టుకు సంబంధించిన సబ్సిడీ వాస్తవాలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బహిర్గతం చేయాలని లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ డిమాండ్ చేశారు. అలాగే అస్సాం ఎంపీ కూడా ఇదే విషయంపై ప్రశ్నించారు. పరిశ్రమల ప్రోత్సాహానికి మద్దతుగా అస్సాంలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ చొరవ పై 2023 మార్చి 22న లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు గోయల్ సమాధానమిచ్చారు. కాంపోనెంట్ కింద మద్దతిచ్చే ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల జాబితాను అందించారని అస్సాం ఎంపీ సూచించారు.