High Temperatures: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు మాడు పగిలే ఎండ, వడగాల్పులు.. మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పగటి పూట జన సంచారం తగ్గింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పగటి పూట బయటకు రావాల్సి వస్తే.. వడదెబ్బకు గురి కాకుండా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Also: LPG Cylinder Explodes: సమోసా దుకాణంలో పేలిన ఎల్‌పీజీ సిలిండర్.. వీడియో వైరల్..
మంచిర్యాల జిల్లా భీమారంలో, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 47.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెలపాడు, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో 46.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నల్గొండ జిల్లా కేతెపల్లి, ఖమ్మం జిల్లా ఖానాపూర్ హవేలీలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌లో 46, ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో 45.7, కొమురం భీం జిల్లా కుంచవెల్లి లో 45.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనాలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
భానుడి ప్రతాపానికి 20 ద్విచక్ర వాహనాలు దగ్ధం
జగిత్యాల జిల్లాలో భానుడి ప్రతాపానికి 20 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో గల ద్విచక్ర వాహన మెకానిక్ అన్వేష్‌కు సంబంధించిన ఇంటి ఆవరణలో ఎండ వేడితో దాదాపుగా 20 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా.. ద్విచక్ర వాహనాలతో పాటు ఇంటిలోని సామాగ్రి మంటల్లో కాలిపోయింది. సుమారు పది లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధితుడు అన్వేష్ వేడుకుంటున్నారు.