మద్యం స్కాం కేసులో సీఐడీ నోటీసులను సవాలు చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. తొందర పాటు చర్యలు తీసుకోకుండా సీఐడీకి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి కూడా హైకోర్టు నిరాకరించింది. 164 స్టేట్మెంట్ ఇవ్వటానికి వెళ్తే అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. విచారణకు కొంత సమయం ఇవ్వాలని కోరటంతో ఆ దిశగా నోటీసులు జారీ చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం వ్యవహారం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం కుంభకోణంలో తెర వెనుక లావాదేవీలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. ఈ కుంభకోణంలో మొత్తం వ్యవహారాన్ని గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెర వెనుక ఉండి నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆయన గురించి కామెంట్స్ చేయడం ఆ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది. వేల కోట్ల వ్యాపారంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతో కసిరెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి.