ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం తీవ్రతరంగా మారుతోంది. శుక్రవారం.. లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఉత్తర ఇజ్రాయెల్‌పై ఒకదాని తర్వాత ఒకటి మూడు దాడులు చేసింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదులు దాదాపు 140 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో జరిగిన నష్టం ఎంతనేది తెలియరాలేదు. గత రెండ్రోజులుగా లెబనాన్ వణికిపోతోంది. కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులుగా మారారు.
లెబనాన్లో మొదటి రోజు పేజర్లు పేలగా.. అనంతరం వాకీటాకీలు పేలాయి. దీంతో లెబనాన్ రక్తసిక్తంగా మారింది. దీంతో.. హిజ్బుల్లా ప్రతీకార దాడులకు తెగబడింది. హిజ్బుల్లా చీఫ్ ప్రతిజ్ఞ చేసిన కొన్ని గంటల తర్వాత.. ఇజ్రాయెల్‌పై 30 రాకెట్ లాంచర్లను ప్రయోగించింది. అయితే ఈ లాంచర్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలపై మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. అంతకుముందు.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) మధ్యాహ్నం నుండి అర్థరాత్రి వరకు సుమారు వెయ్యి బ్యారెల్స్ కలిగిన సుమారు 100 రాకెట్ లాంచర్లపై యుద్ధ విమానాలు దాడి చేశాయి. తన దేశాన్ని రక్షించుకోవడం కోసం హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ యొక్క మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను నాశనం చేయడానికి దాడిని కొనసాగిస్తామని ఐడిఎఫ్ చెబుతోంది.
Read Also: Terror Attack: పాకిస్థాన్ ఆర్మీపై తెహ్రీక్-ఏ-తాలిబాన్ భారీ ఉగ్రదాడి.. ఆరుగురు సైనికులు మృతి
గతేడాది అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. కొందరిని బందీలుగా తీసుకుపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోతుంది. దాదాపు ఏడాది నుంచి హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.